WARANGAL

Wednesday, February 26, 2014

కాకతీయ శిల్పం

కాకతీయ శిల్పం

శిల్పాన్ని మలచడంలో అవలంబించిన పధ్ధతిని (style ని) దృష్టిలో పెట్టుకుని చూస్తే, తూర్పు చాళుక్యుల కాలపు శిల్పం అలంకరణ   పెద్దగా ఉండని సాదా శిల్పం. పశ్చిమ చాళుక్యులది అలంకరణ సహిత శిల్పం. హొయసలులది అమితాలంకరణతో నిండిన శిల్పం. కాకతీయులది పశ్చిమ చాళుక్యుల కాలపు అలంకరణకూ హొయసలుల కాలపు అమితాలంకరణకూ మధ్యస్తంగా ఉండే శిల్పం అని పెద్దల మాట. తనదైన ఒక ప్రత్యేకతను నిర్ధారించుకుని కాకతీయ శిల్పం, ఆ వంశపు మలితరం రాజులలో మొదటివాడనదగిన రుద్రదేవుని పరిపాలనా కాలంలో, అంటే క్రీ.శ.1158 నుండి 1195 మధ్య కాలంలో, ఊపిరిపొసుకుని వికాసంపొందింది.
వేయి స్తంభాల గుడి - చిత్రం (1)
వేయి స్తంభాల గుడి – చిత్రం (1)
రుద్రదేవుడు కాకతీయ వంశపు రాజులలో రెండవ ప్రోలుడు గా పిలవబడే రెండవ ప్రోలరాజు (క్రీ.శ.1115-1157)యొక్క ఐదుగురు పుత్రులలో పెద్దవాడు. క్రీ.శ.1157లో తీరాంధ్ర మండలంలో జరిగిన ఒక యుధ్ధంలో సంభవించిన ప్రోలుని మరణానంతరం రాజ్యాధికారాన్ని చేబడతాడు. తండ్రి అయిన రెండవ ప్రోలుడు కాకతీయ సామ్రాజ్యమనే సౌధానికి పునాదులను వేస్తే, కొడుకైన ఈ రుద్రదేవుడు ఆ పునాదులపై తండ్రి తలచిన రీతిలో ఆ సౌధ నిర్మాణాన్ని పూర్తిచేసి చూపెట్టాడు. రుద్రదేవుని కాలంలోనే కాకతీయ సామ్రాజ్యం స్వతంత్ర రాజ్యమైంది. స్వతంత్ర రాజ్య స్థాపన సందర్భంగా, శక సంవత్సరం 1084 చిత్రభాను సంవత్సరం మాఘ శుధ్ధ త్రయోదశికి   సరియైన క్రీ.శ.1163 జనవరి 19 శనివారం నాడు  అనుమకొండలో తనపేరున రుద్రేశ్వరదేవుని, వాసుదేవుని, సూర్యదేవుని ప్రతిష్ఠించి ఆ త్రికూటానికి వేయిస్తంభాలతో విరాజిల్లే మండపం వున్న దేవాలయాన్ని నిర్మింపజేశాడు. అదే ఇప్పుడు వేయి స్తంభాల గుడిగా పిలవబడుతూన్నది. ఆ ఆలయ పోషణ కొసంగా మద్దిచెఱువుల గ్రామాన్ని దానంగా ఇచ్చినట్లు తెలియజేసే శాసనం వేయిస్తంభాల గుడి శాసనంగా ప్రసిధ్ధమైంది. శాసనంలోని భాష సంస్కృతం. రుద్రదేవుని తండ్రియైన రెండవ ప్రోలరాజు విజయాలు, స్వతంత్ర రాజ్య స్థాపనకు ముందు రుద్రదేవుని విజయాలు అన్నీ కలిపి ఇందులో దాదాపుగా యాభై శ్లోకాలలో చెప్పబడినాయి. భరద్వాజ గోత్రుడు, రామేశ్వరదీక్షితుని పుత్రుడు, అద్వయామృత యతి శిష్యుడు అయిన అచింతేంద్రయతి  ఈ శాసనాన్ని ఒక చిన్న కావ్యంలాగా తీర్చి దిద్దాడని పెద్దల భావన.
వేయి స్తంభాల గుడి - చిత్రం (2)
వేయి స్తంభాల గుడి – చిత్రం (2)
వేయి స్తంభాల గుడి - చిత్రం (3)
వేయి స్తంభాల గుడి – చిత్రం (3)
రుద్రదేవుడు మంచి యోధుడు. కాకతీయ రాజ్య స్థాపకుడు. త్వరలోనే రాజ్యానికి తగినదైన ఒక రాజధాని, ఆ రాజధానికి సరితూగగల భవన సముదాయం, ఆ సముదాయానికి తగిన భద్రత, వీటన్నిటి అవసరాన్ని గుర్తించినవాడై కాకతీయుల ఆరాధ్య దైవమైన స్వయంభువ శివుని సన్నిధిలో ఒక పటిష్టమయిన కోట నిర్మాణానికి ఆలోచన చేసి ఆచరణలో పెడతాడు. కాని ఈ కోట నిర్మాణం అతని తరువాత నాలుగేళ్ళకు రాజై (వీరిరువురి నడుమ మహాదేవుని పాలన నిండా మూడేళ్ళుకూడా లేదని చరిత్ర చెబుతుంది) క్రీ.శ.1199 నుండి 1262 దాకా, ఆరు దశాబ్దాల పైగా కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించిన  గణపతిదేవుని కాలంలో గాని పూర్తికాలేదు. అయితే రుద్రదేవుడు వేసిన పునాదులపైనే ఓరుగల్లు కోట నిర్మాణం జరిగిందనేది లోక ప్రసిధ్ధం.
కాకతీయ శిల్పులు తీర్చి దిద్దిన శిలా తోరణం - చిత్రం (1)
కాకతీయ శిల్పులు తీర్చి దిద్దిన శిలా తోరణం – చిత్రం (1)
ఓరుగల్లు కోట మూడు ప్రాకారాలతో పరివేష్టించబడి ఉండేటట్లుగా నిర్మించబడింది. వెలుపలి, మొదటి లోపలి ప్రాకారాలు రెండూ మట్టివి. లోపలిదైన మూడవ ప్రాకారం రాతిది.  ఈ రాతి ప్రాకారాన్ని దాటి లోపలికి వెళితే రాజధాని నగరం, రాజప్రాసాదాలు. ఇక్కడి అప్పటి రాజప్రాసాదాల అవశేషాలు ఇంకా గుర్తించబడలేదు. అయితే, ఇక్కడ ముఖ్యంగా  ఆకర్షించే నిర్మాణాలు శిలా తోరణాలు. కాకతీయరాజుల కాలపు శిల్పకళా కౌశలానికి ఈ తోరణాలు ముఖ్యమైన ఆనవాళ్ళుగా నిలిచి వున్నాయి.
కాకతీయ శిల్పులు తీర్చి దిద్దిన శిలా తోరణం - చిత్రం (2)
కాకతీయ శిల్పులు తీర్చి దిద్దిన శిలా తోరణం – చిత్రం (2)
కాకతీయ శిల్పులు తీర్చి దిద్దిన శిలా తోరణం - చిత్రం (3)
కాకతీయ శిల్పులు తీర్చి దిద్దిన శిలా తోరణం – చిత్రం (3)
తోరణాల నిర్మాణం భారతీయ ఆలయ వాస్తులో సాంచి స్తూపం చుట్టూ సాతవాహన రాజైన శ్రీ శాతకర్ణిచే క్రీ.పూ.2 వ శతాబ్ది కాలంలో నిర్మించబడిన రాతి ఆవారం (stone balustrade), మధ్యలో నాలుగు దిశలా నాలుగు తోరణ ద్వారాల నిర్మాణంతో ప్రవేశపెట్టబడింది. తోరణ నిర్మాణానికి సంబంధించిన ప్రాథమిక సూత్రాన్ని అందులోంచే గ్రహించినప్పటికీ, తమదైన శైలిలో అందమైన మార్పులన్నిటినీ చేసి అందులోంచి ఒక విశిష్టమైన నిర్మాణాన్ని సాధించి, కాకతీయ తోరణంగా ప్రతిష్ఠించి, శిల్పకళలో తమ ప్రతిభను చాటుకున్నారు కాకతీయ కాలపు శిల్పులు. తెలుగు ప్రజల కళాదృష్టికి, అభిరుచికి, కాకతీయుల కాలపు శిల్పుల కళా ఔన్నత్యానికి నిదర్శనాలుగానూ, అందులో వారి ప్రతిభను చాటి చెప్పే కీర్తి తోరణాలుగానూ  ఆ శిలా తోరణాలు ఇప్పటికీ  నిలిచి ఉన్నాయి.
dance_divine_1
ప్రస్తుతం ‘ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా’ (ఆం.ప్ర. శాఖ) వారి పరిరక్షణలో ఉన్న ఈ ప్రదేశంలో, వారిచే భద్రపరచబడి ఉన్న మరొక శిల్ప కళాఖండం, ఒక శిలాఫలకంపై మలచబడిన శక్తిస్వరూపిణి, అంబ అయిన దాక్షాయని నాట్యం చేస్తున్నట్లుగా ఉన్న శిల్పం. చాలా భాగం ఖండితమైనప్పటికీ, ఈ శిల్పంలో ద్యోతకమవుతూ కనులకు కనుపించే నాట్యం  చూపరులను ఇప్పటికీ పారవశ్యంలో ముంచుతుందనడానికి  ఎంతమాత్రం సందేహించాల్సింది లేదు.

కాకతీయులు (4)

కాకతీయులు (4)
‘కాకతి’ అన్నది ఒక ఊరి పేరా, దేవత పేరా అన్న విషయంపై భిన్నమయిన అభిప్రాయాలూ వున్నాయి. ఆంధ్ర చరిత్ర పరిశోధకుల మధ్య ఈ విషయమై బహు విధాల చర్చ జరిగింది. కాకతీయుల వంశంలో ఈ మొదటిబేతరాజుకు పూర్వమే, అతని పేరులో ‘కాకతి’ శబ్దం కనుపించే ‘కాకర్త్య గుండ్యన’ అనే రాజు వున్నాడు. ఇతడు క్రీ.శ.945-995 మధ్య కాలానికి చెందినవాడు. ఇతని పేరులోని ‘కాకర్త్య’ అనే పదం సంస్కృతీకరణం చెందిన ‘కాకతి’ శబ్దం అనీ, కొన్ని తెలుగు పేర్లు సంస్కృతీకరణం చెందే క్రమంలో గాలి నరసయ్య అనే పేరు వాతుల అహోబిలపతి అయినట్లుగా ‘కాకతి గుండన’ శబ్దం ‘కాకర్త్య గుండ్యన’ గా మారడం అసంభవమేమీ కాదని చరిత్రకారుల అభిప్రాయం. ఇతనిది సామంతఒడ్డె వంశం. ఒడ్డె పదం ఓడ్ర శబ్దాన్నుంచి పుట్టినది కాబట్టి ఇతడు విశాఖపట్టణ ప్రాంతపు ఒడ్డెనాడుకు చెందినవాడయి వుండవచ్చని ఒక అభిప్రాయం. కాకతీయులు దుర్జయవంశంవారని ఒక శాసనంలో కనబడుతుంది.
కాకర్త్య గుండ్యన తూర్పు చాళుక్యుల వద్ద ఉన్నతోద్యోగంలో వున్న వాడని మాగల్లు శాసనం వలన తెలుస్తుంది. ఇతడు అనుమకొండలోని ప్రాచీన రాజవంశజులతో పెళ్ళిసంబంధం చేసుకుని పెండ్లి గుండమరాజు అని కూడా పిలవబడ్డాడు. ఇతనికి కుంతలదేవి అని ఒక సోదరి ఉంది. ఆమెను బలవంతులయిన విరియాల వంశంజులకు ఇచ్చి వివాహంచేయడం ద్వారా వరంగల్లులో తన స్థానాన్ని పదిలం చేసుకో సంకల్పించాడని చెబుతారు. విరియాల వారిది దుర్జయ వంశం. వీరి వృత్తాంతం క్రీ.శ.1000 ప్రాంతపుదైన గూడూరు శాసనంలో వివరంగా వుంది. ఈ రాజులలో ఎఱ్ఱనరేంద్రుడు పరాక్రమశాలి. ఈయన భార్య కామమసాని, గొప్ప రాజనీతిజ్ఞురాలు, వీరవనిత. పెండ్లి గుండనగా పిలవబడిన కాకర్త్య గుండ్యన సోదరి పేరు కుంతలదేవిగా వున్నా, ఈ విరియాల కామమసాని అనే వనితనే కుంతలదేవిగా చరిత్రకారులు గుర్తిస్తున్నారు.
కాకర్త్య గుండ్యన అనుమకొండలోని రాజవంశీయులతో పెళ్ళిసంబంధ మేర్పరచుకుని, అక్కడ తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే లోపలే మరణిస్తాడు. అతని కొడుకైన బేతరాజు అప్పటికి చాలా చిన్నవాడు, బాలుడు. మేనల్లుడు, బాలుడు అయిన బేతరాజును అతని మేనత్తయైన విరియాల కామమసాని (గుండ్యన చెల్లెలైన కుంతలదేవి), భర్తయైన ఎఱ్ఱనరేంద్రుని సహయంతో సంరక్షించి కాపాడుతుంది. బేతరాజు యుక్తవయస్కుడు కాగానే అతడిని రాజ్యాభిషిక్తుని చేస్తుంది. ఇది గూడూరు శాసనంలో చెప్పబడి ‘కాకతి నిల్పుట కోటి సేయదే’ అని కామమసాని రాజనీతిజ్ఞతకు ప్రశంసాపూర్వక కథనంగా లోకోక్తియై చరిత్రలో నిలిచింది.
దేశ చరిత్రలో ఒక నూతన రాజవంశం రూపుదాల్చి నిలదొక్కుకోవడానికి మానవ ప్రయత్నమేకాక, ఆ ప్రయత్నానికి దైవానుగ్రహం కూడా తోడైవుండాలనడానికి కాకతీయుల చరిత్రలోని ఈ కుంతలదేవి – బేతరాజుల ఉదంతం ఒక ఉదాహరణగా నిలుస్తుంది. కాకతి గుండన ముందు చూపుతోకూడినదైన చర్య, కుంతలదేవికి తన అన్నపైనున్న గౌరవం, ఆ అన్న కొడుకూ తన మేనల్లుడూ అయిన బేతరాజుపై ఆప్యాయతా ఆంధ్ర దేశ చరిత్రలో కాకతీయులనే ఒక ప్రసిధ్ధ రాజవంశం రూపుదాల్చడానికి కారణమయింది. ఇలా రాజ్యాభిషిక్తుడయిన వాడే మొదటి బేతరాజు. ఇతనికి గరుడ బేతరాజని కూడా పేరు వుంది. ఇతడు క్రీ.శ.995-1052 మధ్య రాజ్యపాలన చేసినట్లుగా తేల్చారు. చారిత్రకంగా ఇతడితోనే కాకతీయవంశం ప్రారంభమయిందని చరిత్ర పరిశోధకులు భావిస్తారు. ఇతని కొడుకు మొదటి ప్రోలరాజు, క్రీ.శ.1052-1076 మధ్య రాజ్యపాలన చేశాడు. ఈ మొదటి ప్రోలరాజు కొడుకే త్రిభువనమల్ల బేతరాజు, క్రీ.శ.1076-1108 మధ్య కాలంలో రాజ్యపాలన చేశాడు. ఇతని కాలానికి ముందు కాకతీయుల వంశంలో ఎంతలేదన్నా నాలుగైదు తరాల చరిత్ర గడిచిపోయిందని చెప్పవచ్చు.
కాకతీయ వంశపు తొలితరం రాజుల పేర్లు గుండన, ప్రోల, బేత అని వుండగా, ఈ త్రిభువనమల్ల బేతరాజు పేరులో ‘త్రిభువనమల్ల’ చేరడానికీ ఒక కథ వుంది. కాకతీయ వంశంలో బేతరాజు అనే పేరుతో రాజ్యమేలిన రాజులు ఇద్దరు కాబట్టి ఇతనికి రెండవ బేతరాజని కూడ పేరుంది. ఇతడు రాజ్యభారాన్ని చేపట్టే నాటికి కళ్యాణి చాళుక్య రాజులలో రాజ్యాధికారం గూర్చి వారిలో వారికి అంతః కలహం చెలరేగింది. ఆ కలహంలో రెండవ బేతరాజు తన అనుకూల్యతను ప్రకటించి అతని పక్షం పోరాడిన విక్రమాదిత్యుడు అనే రాజు త్రిభువనమల్లుడనే పేర చాళుక్య సింహాసనాన్నిక్రీ.శ.1076 అధిష్ఠించాడు. ఆ రాజు తన విజయ సూచకంగా, ఆ ప్రయత్నంలో తనకు సహాయపడిన బేతరాజుకు తనవైన రెండు బిరుదులను ఇచ్చి గౌరవించాడు. వాటిలో ఒకటి ‘త్రిభువనమల్ల’ అనే బిరుదు. ఈ బిరుదు పేరుకు ముందు చేరి రెండవ బేతరాజు ‘త్రిభువనమల్ల బేతరాజు’ అయ్యాడని చరిత్రకారులు చెప్పారు. ప్రజలు ఈ ‘త్రిభువనమల్ల’ అనే బిరుదనామాన్నే బాగా గుర్తుపెట్టుకున్నారు. ఈ కాకతీయ రెండవ బేతరాజుకు చాళుక్య ప్రభువుల వద్ద ఒక విశిష్ట స్థానం ఉండేది అనేది ఈ ఉదంతం వలన తెలియ వచ్చే మరొక విషయం.

కాకతీయులు (3)

కాకతీయులు (3)
శక సంవత్సరం 1166లో ఉమ్మక్క ఒక పుత్రునికి జన్మనిచ్చింది. సకల రాజమర్యాదలతో  ఆ పిల్లవానిని సామంతరాజులందరి సమక్షంలో రాజ్యాభిషిక్తుని చేశారు. ఆ పిల్లవానికి ప్రతాపరుద్రుడని నామకరణం చేశారు. ప్రతాపుడు పెరిగి పెద్దవాడయ్యడు. ఉమ్మక్కకు రెండవ పుత్రుడుగా అన్నమదేవుడు జన్మించాడు. ప్రతాపునికి వేదవిద్య, రాజరికానికి సంబంధించిన అన్ని విద్యలూ బోధించబడ్డ తరువాత అతని 16వ ఏట, 16 మంది కన్యలతో పెళ్ళి జరిగింది. వారిలో మొదటి భార్య విశాలాక్షి. రుద్రాంబ శక సంవత్సరం 1216 లో, 38 సంవత్సరాల పాలన అనంతరం స్వర్గస్తురాలయింది.
రాజ్యాభిషిక్తుడయ్యాక, ప్రతాపరుద్రుడు దిగ్విజయానికి బయలుదేరి, మొదటగా కటక బళ్ళాలుని జయించి, 3 కోట్లు పరిహారంగా పొంది, అతని కొడుకును రాజ్యాభిషిక్తుని చేశాడు. అతడూ, అలా ప్రతాపరుద్రునిచే జయించబడిన మిగతా రాజులు వారి వారి సైన్యాలతో ప్రతాపుని ఆజ్ఞ మేర వెంటవెళ్ళారు. అలా పాండ్య రాజును జయించాడు. దక్షిణానికి మరలి గోదావరి (?) నదిని దాటి రామేశ్వరాన్ని స్వాధీనం చేసుకున్నాడు. రామేశ్వరంలో పూజలు నిర్వహించి, తామ్రపర్ణి తీరాన్ని చేరగా అక్కడ పాలనలో వున్న  విజయనగర రాజైన  నరసింహరాయుడు ప్రతాపుని పెద్ద మొత్తాలలో బహుమానాలతో సత్కరించాడు.
ఆ తరువాత, ప్రతాపుడు ఒక స్త్రీ పరిపాలనలో వున్న రాజ్యం వైపుకు వెళ్ళి అక్కడ  రాణి అయిన ముకుందదేవిని జయించాడు. ఆ పై, కొంకణ, టంకణ, మళయాల, బాహ్లిక, గుజరాష్ట్ర  రాజులను కూడా జయించి వారి వద్ద నుండి పెద్ద మొత్తాలలో బహుమానాలను రాబట్టాడు. ఢిల్లి రాజు ప్రతాపునికి కానుకలను పంపాడు. ఆ కానుకలతో ప్రయాగకు వెళ్ళి, ప్రయాగ మాధవదేవునికి అవి సమర్పించాడు. బెనారసులో కూడా పూజలు నిర్వహించి విశ్వనాథునికి ఆ నగరాన్ని సమర్పించాడు. గయకు వెళ్ళి అక్కడి రాజును కలుసుకున్నాడు. పై ప్రదేశాలలో  చాలా చోట్ల తులాపురుషదానాలను చేశాడు. తన రాజధానికి తిరిగి వచ్చి తమ్ముడైన అన్నమదేవుని, తాను లేని ఆ 12 సంవత్సరాల కాలంలో రాజ్యాన్ని పరిరరక్షిస్తూ వుండినందుకు చాలా ఆనందపడి ఆదరించాడు.
ప్రతాపుడికి విశాలాక్షి ద్వారా విరూపాక్షుడు, వీరభద్రుడు అని ఇరువురు కొడుకులు కలిగారు. ప్రతాపరుద్రుని పరిపాలనా కాలంలో రెండు సార్లు ముసల్మాను సేనలు దండయాత్రలు చేశాయి. ఒక సారి ప్రతాపరుద్రుని బందీగా కూడా చేసుకున్నాయి.
ఢిల్లీ సుల్తాను ప్రతాపుని సాదరంగా ఆహ్వానించాడు. ప్రయాగ మాధవదేవుని భక్తురాలయిన అతని  తల్లి సలహా మీద, ప్రతాపుని కోరిక మీద, డిల్లీ సుల్తాను ఆ హిందూ రాజును, అతనికి సంరక్షకులనుగా 20,000 సైన్యాన్ని తోడుగా ఇచ్చి, బెనారసుకు పంపాడు. ప్రతాపునితో వెళ్ళిన బ్రాహ్మణులను కూడా ఆ రాజు బాగా సత్కరించాడు.
ప్రతాపుడు బెనారసులో 8 తులాపురుషదానాలను చేసి, గోదావరి తీరానికి వెళ్ళడానికి బయలుదేరాడు. దారిలో, శివదేవయ్య మరో 8 రోజులలో ఆ రాజు మరణం గోదావరీ తీరంలో సంభవమని లెక్కకట్టి వున్నందువలన, ఆయన సలహా మీద, కాళేశ్వరం అనే చోట ఆగుతాడు. ఈ లోపల అన్నమదేవుడు, నరపతి ఇరువురూ సుల్తాను సైన్యాన్ని ఓడించి వారిని తరిమికొడతారు. ప్రతాపుడు కాళేశ్వరానికి చేరి వున్నాడని తెలుసుకున్న వారిరువురూ అతని దగ్గరకు వచ్చారు. ప్రతాపుడు వారి శౌర్యాన్ని మెచ్చి తన కూతురైన రుద్రమదేవిని నరపతికి, 5 కోట్ల ధనంతోనూ కృష్ణకు దక్షిణంగా ఉన్న భూభాగంతోనూ, ఇచ్చి వివాహం చేశాడు.
కటకాన్ని 3 కోట్ల ధనంతో సహా రామరాయలను పెండ్లాడిన అన్నమదేవుని కూతురికి కట్నంగా ఇచ్చాడు. ప్రతాపుడు క్రీ.శ.1324 లో మరణించాడు. అతని రాణి అయిన విశాలాక్షి సహగమించింది. అన్నమదేవుడు వారికి ఘనంగా ఉత్తరక్రియలను నిర్వహించి, రాజ్యాన్ని వీరభద్రునికి ఇచ్చి, ప్రతాపుని కొడుకైన విరూపాక్షుడు తోడుగా రాగా వింధ్య ప్రాంతపు అడవులకు వెళ్ళిపోయాడు. శివదేవయ్య శ్రీశైలం చేరాడు. మొత్తంమీద ప్రతాపుని పాలన 76 సంవత్సరాలు సాగింది.
విజయనగర ప్రభువైన కృష్ణదేవరాయలు కొండవీడు, కొండపల్లి, వినుకొండ, బెల్లంకొండ, నాగార్జునకొండలను జయిస్తూ వచ్చి, వరంగల్లును ముట్టడించి అక్కడి ముసల్మానులను తరిమి కొట్టాడు. వరంగల్లులోని కాకతీయ వంశీయులకు రాజమర్యాద పూర్వకంగా ఇవ్వవలసిన ధన్నాని ఇచ్చాడు. ఇది అచ్యుత, సదాశివరాయల పాలన వరకూ సాగింది. అయితే, ఆ తరువాత అళియరామరాయల పతనం తరువాత, డక్కను భూభాగం అంతా ముసల్మానుల హస్తగతమయింది.”
ఇది సంగ్రహంగా మెకంజీ స్థానిక చరిత్రలలో రికార్డు చేయబడిన కాకతీయుల చరిత్ర.
అయితే, ఇప్పుడు ముఖ్యంగా శాసనాధారాలతోనూ, ఇంకా  ఇతరాలయిన ఆధారాలతోనూ చరిత్ర పరిశోధకులు రచించిన కాకతీయుల చరిత్రకూ, జనశ్రుతంగా వచ్చి మెకంజీ స్థానిక  చరిత్రలలో సేకరించబడి చేరిన కథలోని భాగాలకూ సామ్యాలూ విబేధాలూ, తత్సంబంధ చారిత్రక అంశాలనూ చర్చించుకుంటూ ముందుకు వెళితే–
మొదటగా, ఈ కథ ఆరంభంలో చెప్పబడిన త్రిభువనమల్లుడు చరిత్రకారులు నిర్ణయించిన త్రిభువనమల్ల బేతరాజు అనబడే రెండవ బేతరాజు. ఇతడు క్రీ.శ.1075/76 నుండి 1108/11 దాకా రాజ్యం చేశాడని శాసనాధారాలను బట్టి చెప్పారు. ఇతడు కాజీపేటలో వేయించిన ఒక శాసనంలో తన తాత అయిన మొదటి  బేతరాజును గురించి ‘సామంతవిష్టి వంశః శ్రీమాన్ కాకతిపురాదినాథోబేతః’ అనడాన్ని బట్టి, ఇతడు సామంతవిష్టి వంశం వాడనీ, కాకతిపురాధీశుడనీ చెప్పడం జరిగింది. అయితే ఈ కాకతిపురం ఏది అన్నది ఇప్పటికీ  తేలని విషయం.

కాకతీయులు (2)

కాకతీయులు (2)
రుద్రుడు తన రాజ్యానికి తూర్పుగా వున్న పరగణాల మీదికి దండెత్తి వెళ్ళి, ఆ తరువాత దక్షిణం వైపున రామేశ్వరం, ధణుష్కోటి దాకానూ వెళ్ళి అక్కడ 8 సార్లు తులాపురుషదానాలు చేశాడు. తిరిగి వచ్చే దారిలో పాండ్య రాజును జయించి అతని కుమారునికి పట్టం కట్టి వచ్చాడు.
రుద్రుని తమ్ముడైన మహాదేవుడు ఈ లోపల, కొంత సైన్యాన్ని సమకూర్చికుని అన్నపై తిరగబడ్డాడు. రుద్రుని పాలన 78 సంవత్సరాలు సాగి శకసంవత్సరం 1109 లో (ఇది తప్పు అని చరిత్ర) ముగిసింది. ఈ రుద్రుడు కాకతీయులలో  ప్రతాపరుద్రుడు కాదు, ఇతడు గణపతిదేవునికి తండ్రి అయిన రుద్రుడు మాత్రమే.
మహాదేవుని వంచనతో కూడిన ఆక్రమణాన్ని ఇష్టపడని మంత్రులు, రుద్రుని కుమారుడైన గణపతిని రాజ్యాభిషిక్తుని చేయబోగా, గణపతి యువరాజుగానే ఉండడానికి ఇష్టపడినందువలన, మహాదేవుడు రాజై మూడేళ్ళు పాలించాడు. మహాదేవుడు గణపతి అనుమతితో దేవగిరిపైకి దండెత్తి వెళ్ళి ఆ పోరులో ఒక ఏనుగుపై ఎక్కి యుధ్ధం చేస్తూ ప్రాణాలు పోగొట్టుకున్నాడు.
గణపతిదేవుడు శ్రీశైలం పరిసరాలనుంచి తెచ్చిన శిలలతో వరంగల్లు కోటనూ, శివునికి దేవాలయాలను నిర్మింప జేశాడు. మహాభారతాన్ని తెనిగించిన తిక్కన మహాకవి  (నెల్లూరు రాజైన మనుమసిధ్ధి రాయబారిగా) గణపతి ఆస్థానానికి రాగా,ఆ రాజూ, అతని ఆస్థానంలోని కవులూ పండితులూ ఆయనను గొప్పగా సత్కరించారు. గణపతిదేవునికి  తిక్కన వేదాలనూ, శాస్త్రాలనూ, మహాభారతాన్ని అధ్యయనం చేయడం లోని ముఖ్యాంశాలను గురించి వివరంగా చెబుతాడు. గణపతిదేవుని ఆస్థానంలోని జైనులతోనూ, బుధ్ధులతోనూ తీవ్రంగా వాదించి వారిని నిరసించాడు. రాజకీయం మీద, వేదాంత విషయాల మీద తిక్కన గణపతిదేవునికి తగు బోధ చేశాడు.
అక్కన, బయ్యన అనే వారిచే సూర్యవంశీయుడైన మనుమసిధ్ధి తన రాజధాని నుంచి తరిమివేయబడినాడనీ, ఆ రాజుకి అతని రాజ్యాన్ని  తిరిగి దక్కించుకోవడంలో గణపతిదేవుని సహాయాన్ని అర్ధించడం, తాను వచ్చిన పనిగా తిక్కన చెబుతాడు. గణపతిదేవుడు  ఆ కార్యానికి అంగీకరించి తిక్కనను తగు విధంగా సత్కరించి బహుమతులిచ్చి పంపుతాడు. తిక్కన వెళుతూ, శైవుడైన శివదేవయ్యను గురించి గొప్పగా చెబుతాడు. శివదేవయ్య తరువాతి కాలంలో కాకతీయ రాజులకు మంత్రి అయ్యాడు.
మాట ఇచ్చినట్లుగానే, గణపతిదేవుడు  పెద్ద సైన్యంతో  వెళ్ళి, వెలనాడును ముట్టడించి, జయించి వారి కోటను తగులబెట్టించాడు. బయ్యనను తరిమివేసి అతని రాజముద్రికలను తెరల రుద్రదేవునికి ఇస్తాడు. మనుమను నెల్లూరులో పునః ప్రతిష్టించి, తాను జయించిన 24 దుర్గాలనూ, 68 పట్టణాలనూ అతనికి బహుమానంగా ఇచ్చి, వరంగల్లుకి తిరిగి వచ్చాడు.
తన కోటను మరింతగా సంరక్షించుకోవాలని, రాత్రి పగలనిలేక  నిరంతరం కోటచుట్టూ సైనికులు కాపలా వుండేలా నియమం చేస్తాడు. ఒక అక్షౌహిని సైన్యాన్ని కోటలో ఎప్పుడూ సిధ్ధంగా వుండేలా ఏర్పాటు చేస్తాడు. అతని పాలన పటిష్ఠంగా సుఖంగా సాగింది.
గణపతిదేవుడు శ్రీశైలం దర్శించి అక్కడి దేవుడైన మల్లికార్జునునికి 12,000 సువర్ణ పుష్పాలను సమర్పించాడు. ఆ రోజుననే, పంధలింగాల కు వెళ్ళి, కృష్ణానదిలో  స్నానంచేసి 16 రకాల దానాలను చేశాడు. శ్రీశైలంలో 4 చెరువులను, 4 శైవాలయాలను ఒక వైష్ణవాలయాన్ని నిరిమింపజేశాడు. మల్లికార్జునారాధ్యుని చేతులమీదుగా శైవుడయ్యాడు.
వరంగల్లుకు 3 యోజనాల దూరంలో తన పేరు మీదుగా గణపురమనే గ్రామాన్ని, చెరువును నిర్మింపజేశాడు. కటకాన్ని పాలిస్తూండిన రాజును తన సామంతునిగా చేసుకున్నాడు. మొత్తం మీద గణపతిదేవుడు 68 సంవత్సరాలు పాలించాడు. అతనికి ఉమ్మక్క అని ఒక కూతురు వుంది. ఆమెకు వయసు రాగానే, చాళుక్య వంశానికి చెందిన వీరభద్రునితో వివాహం జరిపించాడు.
గణపతిదేవుని తరువాత ఆతని భార్య రుద్రాంబ, శివదేవయ్య సలహాతో, రాజ్యభారాన్ని స్వీకరించింది.
ఆమె చాలా మంది దేవతలను సువర్ణ పుష్పాలతో, ఆమె కూతురయిన ఉమ్మక్క ద్వారా వీరుడయిన మనుమడిని పొందాలని పూజించి ‘దశరీడ్లనోము’ అనే పేరున్న నోము నోచింది. ఆ పూజా కార్యక్రమాలలో భాగంగా ఆమె వరంగల్లులో లేని సమయంలో హరిహరదేవుడు మురారి అనే ఇద్దరు సామంతులు తిరుగుబాటు చేయగా, వారిని ఓడించి వారి ఆస్తులను స్వాధీనం చేసుకుంది.
దేవగిరి పాలిస్తూండిన రాజు అకారణంగా వరంగల్లు మీద దండెత్తి వచ్చి కోటను ముట్టడించాడు. అయితే, ఓడించబడి ఒక కోటి దనాన్ని పరిహారంగా చెల్లించేలా చేయబడ్డాడు. ఆమె తన రాజ్యానికి సరిహద్దు రేఖల వెంబడి విజయస్తంభాలను పెట్టించింది. రుద్రాపురం, అంబాపురం అనే పేర్లతో రెండు గ్రామాలు ఆమె పేరుమీద నిర్మించబడ్డాయి.

కాకతీయులు (1)

కాకతీయులు (1)
ఆంధ్రుల చరిత్రలో కాకతీయులది ఒక ప్రముఖ స్థానం. మెకంజీ సేకరించిన స్థానిక చరిత్రలలో అనుమకొండ హనుమకొండకు తొలి రూపం), వరంగల్లులను గురించి, ఈ రెండు పట్టణాలను రాజధానులుగా చేసుకుని పాలించిన కాకతీయ రాజుల వంశావళిని గురించి చెప్పే గాథలు వున్నాయి. చరిత్ర పరంగా చూసినప్పుడు ఈ గాథలకు, కొన్ని కొన్ని చోట్ల అతిశయమూ కల్పనా  చేరి వుండడం వలన, అన్నిటికీ అంతగా ప్రాముఖ్యం లేకపోయినప్పటికీ, కొన్ని వందల సంవత్సరాలుగా జనశ్రుతంగా తరం నుంచి తరానికి వచ్చి చేరినవి కాబట్టి, ఆంధ్ర దేశ చరిత్ర రచన మొదలెట్టిన తొలినాళ్ళలో ఆ కథలలోని విషయాలు కొన్నైనా ఆధారాలుగా నిలిచాయి కాబట్టీ వాటి  ప్రాముఖ్యత వాటిది. కాకతీయుల చరిత్రకు సంబంధించి  ఆ గాథలలో చరిత్రకు దగ్గరగా వున్నట్లనిపించే కొన్న గాథల సారాంశం ఇది:
కాకతీయ వంశానికి చెందిన మొదటి తరం రాజులలో ఒక రాజు త్రిభువనమల్లుడు. ఆ రాజుకి కాకతి అనే  దేవత కరుణ వలన కాకతి ప్రోలుడు జన్మించాడు. త్రిభువనమల్లుడు కటకాన్ని పాలిస్తూండిన  తిరుగుబాటుదారయిన రాజును రణంలో ఓడించి చంపి, ఆ స్థానంలో అతని కుమారుని రాజ్యాభిషిక్తుని చేసి, ఆ రాజు ధనాగారాన్ని వెంట తరలించుకు వెళ్ళాడు. గంగాపురం అనే ప్రదేశంలో త్రిభువనమల్లుడు ఎన్నో  దేవాలయాలను నిర్మింప జేశాడు.  ఈ రాజు 86 సంవత్సరాలు పాలించి శక సంవత్సరం 958 లో మరణించాడు.
ప్రోలుడు రాజ్య భారాన్ని చేపట్టే నాటికి చాలా చిన్నవాడు. ఇది అదనుగా చూసుకుని సామంతులు కొందరు తిరగబడతారు. కటకాన్ని పాలిస్తూండిన రాజు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని విశ్వనాథదేవుడనే వాడిని ప్రోలుని మీదికి దండు పంపుతాడు. అనుమకొండ అతడి వశమవుతుంది. ఆ తరువాత 12 సంవత్సరాలు అనుమకొండ పరరాజుల హస్తగతమై వుంటుంది. ఈ కాలంలో వారు ఒక పెద్ద చెరువును కూడా తవ్వించారు. కన్నడసముద్రమని ఆ చెరువుకు పేరు. ప్రోలుడు తన రాజధానిని ఒక స్నేహితుడైన సామంతుని అధీనంలో వుంచి, ఒక రహశ్య మార్గం ద్వారా వెళ్ళి అనుమకొండను జయించి, మళ్ళీ కటకం మీదికి దండు వెళ్ళి, యుధ్ధంలో ఆ రాజును చంపి, వాని కుమారుని ఆ స్థానంలో వుంచి, 2 కోట్ల
సంపదను సంపాదించుకొస్తాడు.
ఈ ప్రొలుడు ఒక పెద్ద శివాలయాన్ని నిర్మింపజేసి, ఆ దేవాలయం చుట్టూ 8 యోజనాల పర్యంతగా వుండే ఒక నగరాన్ని కూడా నిర్మింపజేస్తాడు. ఇదే ఓరుగల్లు పట్టణం. ఓరుగల్లు కోటకు తొలి నమూనా చిత్రం ఆ స్థానం మీద 909 లో వ్రాయబడింది.
వరంగల్లులో శివాలయం పరశువేది శంభు ఆలయంగా పిలవబడేది. ఆ ఆలయానికి ఆగ్నేయంగా ఒక పెద్ద శిల వుండేది, కనుక ఆ ప్రదేశానికి ఏకశిలానగరమనీ, ఆ ప్రదేశం మీదుగా వెళ్ళే బండి చక్రం ఒకటి ఎప్పుడూ ఒకవైపుకు ఒరిగేది కాబట్టి ఆ ప్రదేశానికి ఓరుగల్లు అనీ పేర్లు వచ్చాయి.
ఓరుగల్లులోని దేవాలయాలలో ప్రతిష్ఠించబడిన ముఖ్యమయిన దేవతా విగ్రహాలు 1. ముక్తేశ్వర, 2. విశ్వనాథ, 3. వ్యక్తవిరూపాక్ష, మల్లికార్జున, 5. రామేశ్వర, 6. నీలకంఠ, 500 చిన్న గుడులు శివునివి, 10 దేవివి, 10 గణపతివి, 300 వాసుదేవునివి, 10 వీరభద్రునివి, కొత్తగా నిర్మించబడ్డాయి.
ప్రోలునికి ఒక దుష్టనక్షత్రంలో ఒక కొడుకు పుట్టాడు. ఆ నక్షత్ర ప్రభావం వలన అతడు తండ్రిని చంపేవాడుగా అయ్యాడు.
ఆ పిల్లవాడు రుద్రుడుగా నామకరణం చేయబడి, మంచి తెలివి కలవాడుగా, శక్తిమంతుడుగా పెరిగాడు. అతడికి ఉపనయనం అయిన తవువాత, శంభుని దేవాలయానికి రాజ రక్షకుడుగా నియమించబడ్డాడు.
మహాదేవుడు ప్రోలునికి రెండవ కుమారుడు. ఇతడు కుష్టువ్యాధి పీడితుడయ్యాడు. ఒక బ్రాహ్మణునికి 5 పుట్ల నువ్వులను ఒకచోట పోసి పెద్ద రాసిగానూ, తోడుగా బంగారంతో చేసిన ఆకులను, మాడలను, దానంగా ఇచ్చిన తరువాత ఆ శ్వేతకుష్టు వ్యాధి నుంచి మహాదేవుడు బయటపడ్డాడు. అయితే, ఆ బ్రాహ్మణుడు ఆ తరువాత బ్రహ్మరాక్షసునిగా మారాడు. ప్రోలుడు ఆ బ్రాహ్మణుని కుమారునికి పెద్ద మొత్తంలో  ధనమిచ్చి కాశీలో దోష పరిహారార్ధం చేయించవలసిన పూజలను చేయించమని పంపాడు. అలా చేసిన తరువాత, నువ్వులరాసిని దానంగా తీసుకోవడం వలన సంక్రమించిన  దోషం పరిహారమై ఆ బ్రాహ్మణుడు ముక్తిని పొందాడు.
ఒకసారి, ప్రోలుడు శంభులింగమును ప్రార్ధించదలచి దేవాలయంలోకి వెళ్ళాడు. ఆ సమయంలో లోపలి ద్వారం దగ్గర రుద్రుడు నిద్రపోతున్నాడు. రుద్రుడి నిద్రను భంగపరచడం ఇష్టపడని ప్రోలుడు పక్కనుంచి ప్రవేశించబోగా, అతని పాదం బొటనవ్రేలు రుద్రునికి తగిలి అతడు నిద్ర మేల్కొంటాడు. నిద్రమత్తు పూర్తిగా వదలని రుద్రుడు, ప్రోలుని ఒక దొంగగా భావించి అతని చేతిలో వున్న కటారితో పొడుస్తాడు. అయితే వెంటనే తనచే పొడవబడినది తండ్రేనని గ్రహిస్తాడు. ప్రోలుడు పురోహితులనూ, రక్షకులనూ, మంత్రులనూ అందరినీ పిలిపించి వారికి జరిగిన సంగతిని, దానికి కారణమైన రుద్రుని జన్మకు సంబంధించిన సంగతినీ చెప్పి, రుద్రుడినే తన అనంతరం రాజునిగా పట్టభిషిక్తుని చేయమంటాడు. రుద్రుడు పట్టభిషిక్తుడవుతాడు. కొన్నాళ్లకు ప్రోలుడు మరణిస్తాడు. అనంతరం రుద్రుడు 73 సంవత్సరాలు పాలించాడు. అతని పాలన 1031 లో అంతమయింది.
రుద్రుడు ప్రజారంజకంగా పాలన చేస్తూ  రాజ్యాన్ని సిరిసంపదలతో నింపాడు. ఓరుగల్లుకు దక్షిణంగా 12 మైళ్ళ దూరంలో వున్న అయినవోలు గ్రామానికి పశ్చిమాన మైలార దేవునికి దేవాలయాన్ని నిర్మింపజేశాడు. అనుమకొండకు నాలుగు మైళ్ళు (రెండు కోసులు) దూరంలో వున్న ఒడ్డిపల్లి అనే గ్రామంలో బొద్దన గణపతికి దేవాలయాన్ని నిర్మింపజేశాడు. మొగలిచెర్ల అనే గ్రామంలో మహాశక్తికి దేవాలయాన్ని నిర్మింపజేసి తిరుణాళ్ళు నిర్వహించబడేలా సౌకర్యం చేశాడు.
కటకం మీదకు దండెత్తి వెళ్ళి ఆ రాజును చంపి, ఆ స్థానంలో అతని కుమారునికి పట్టం కట్టి ప్రతిగా సంప్రదాయకంగా రావలసినది గ్రహించి తెచ్చాడు. ఏకుదేవుడు (?) అనే ఒక సామంతుడు తిరుగుబాటు చేయ యత్నిస్తే, అతడిని ఓడించాడు. వచ్చే దారిలో వెలనాడులో ప్రవేసిస్తాడు. ఆ రాజులు అతడి శౌర్యాన్ని మెచ్చుతారు. ఆ తరువాత కొందరు మ్లేఛ్ఛులనూ (?) జయిస్తాడు.
తండ్రిని చంపిన దోషం పోవడానికి చేయాల్సిన దోషపరిహార క్రియలన్నిటినీ నిర్వర్తిస్తాడు. చాలా ధనం ఖర్చుపెట్టి ఓరుగల్లులో మంచి శిల్పకళతో నిండినవైన ఆలయాలను నిర్మింపజేశాడు. 1000 స్థంభాలు ఆ గుడి ప్రాంగణాన్ని అలంకరించి ఉంటాయి.
చతుర్ముఖేశ్వర దేవాలయానికి నాలుగు వైపులా ద్వారాలపై నాలుగు శాసనాలను నాలుగు భాషలలో లిఖింప జేశాడు.
వరంగల్లు పట్టణంలో కొత్త వీధులను, భవనాలను నిర్మింపజేసి బాగా వృధ్ధిపరిచాడు. రుద్రుని తమ్ముడైన మహాదేవుడు కొందరి తప్పుడు సలహాలను విని అతనికి విరోధిగా మారతాడు. అయితే, ఈ సంగతులను గ్రహించిన రుద్రుడు మహాదేవుని కార్యకలాపాలన్నిటినీ ఒక కంట  కనిపెడుతూ వుండాల్సిందిగా మంత్రులను నియోగిస్తాడు. శ్రీశైల మఠాథిపతుల సలహా మీద  గణపతి అనే పేరున్న ఒక బాలుడిని, (ప్రమథ)గణాల అనుగ్రహంతో జన్మించినవాడుగా నమ్మబడుతున్న వానిని, అక్కడినుంచి తన ఆస్థానానికి తెచ్చుకున్నాడు.

స్థానిక చరిత్రలు – కర్నల్ కాలిన్ మెకంజీ

ఆంధ్ర దేశపు స్థానిక చరిత్రలు  – కర్నల్ కాలిన్ మెకంజీ
ఇదేమీ ఒక పుస్తకం పేరు కాదు. ఆంధ్రదేశంలోని వివిధ గ్రామాల  ‘స్థానిక చరిత్రలు’ అన్న విషయాన్ని తలుచుకున్నప్పుడల్లా మొదటగా మనసులో మెదిలే పేరు మెకంజీ గారిది కాబట్టి ఈ విషయంపై నేను వ్రాసే, వ్రాయబోయే పోస్టులకు శీర్షిక మొదటిది అదిగా పెట్టడం బాగుంటుందనిపించి అలా పెట్టడం జరిగింది.
ఒక ఊరు ఉందంటే, ఆ ఊరికి సంబంధించిన ప్రాథమిక చరిత్ర, అంటే ఆ ఊరు పుట్టడానికి సంబంధించిన చరిత్ర,  ఒకటి తప్పనిసరిగా ఉంటుంది. అది మనకు తెలియడం, తెలియకపోవడం అన్నది అలా వుంచితే, గ్రామ గ్రామానికీ ఉన్న ఈ ప్రాథమిక చరిత్రలే ఆంధ్రదేశ చరిత్ర కు సంబంధించిన పరిశోధనలోనూ, చరిత్ర రచనలోనూ, పెద్దల చేత స్థానిక చరిత్రలు గా పిలవబడి ప్రసిధ్ధికెక్కాయి.  ఈ స్థానిక చరిత్రలను రికార్డు చెయ్యడం (వ్రాసి భద్రపరచడం) అన్న ప్రక్రియను, దాని ప్రాముఖ్యాన్నీ గుర్తెరిగి, వీటన్నిటినీ దొరికినంతవరకూ సేకరించి భద్రపరచడం అన్నదాన్ని మొట్టమొదటగా మొదలుపెట్టిన వ్యక్తి కర్నల్ కాలిన్ మెకంజీ – క్రీ.శ.19 శతాబ్దపు పూర్వార్ధంలో దక్షిణభారత దేశానికంతటికీ సర్వేయర్ జనరల్. ఈ విషయానికి సంబంధించిన సంగతులను సంక్షిప్తంగా ఈ బ్లాగులో నా మొదటి పోస్టులో డా.నేలటూరు వేంకటరమణయ్యగారి చరిత్ర వ్యాసాల పుస్తకం ‘పల్లవులు-చాళుక్యులు’ లోని మొదటి వ్యాసం గురుంచి వ్రాసినప్పుడు తెలియజేయడం జరిగింది.
తెలుగునేలన వెలసి ఉన్న గ్రామాల స్థానికచరిత్రలలో చిన్నవీ పెద్దవీ, ఒక తరం నుంచి ఇంకొక తరానికి చేరే ప్రక్రియలో పెరిగినవీ తరిగినవీ చాలా ఉన్నాయి. వీటిలో ఆసక్తిని రేకెత్తించే సంగతులను చెప్పినవీ, చరిత్రకు సంబంధించిన సమాచారాన్ని అందించగలిగినవీ చాలానే ఉన్నాయి. అసలు ఆంధ్రుల చరిత్ర రచనకు మెకంజీ సేకరించిన ఈ గ్రామచరిత్రలే మొట్టమొదటి ఆధారాలని కూడా పెద్దలు చెప్పారు.
నిన్న, అంటే 23-8-2012 తేది నాటి, The Hindu దినపత్రికలో Main Editionలోని చివరిపేజీలో శ్రీకాకుళం జిల్లా చిట్టివలస గ్రామనికి దగ్గరలో ఉన్న చరిత్రపూర్వ యుగంనాటి ఒక ‘druidical rock worshiping place and shelter’ కనుగొనబడటానికి సంబంధించిన వార్త వచ్చింది. (Druidism అనేది nature-based religion. దానికి సంబంధించినది కాబట్టి druidical అనే మాట! వీరు ప్రథానంగా సూర్యారాధకులు. ఒక పధ్ధతిగా నిలబెట్టబడిన పెద్దపెద్ద శిలలను ఆరాధించేవారు. ప్రపంచ ప్రసిధ్ధి చెందిన ఈస్టర్ ద్వీపంలోని Stonehenge నిర్మాణాన్ని ఇందుకు ఒక ఉదాహరణగా చెబుతారు). ఒక చోట గుంపుగా ఉండి పరిమాణంలో ఒక్కొకటీ దాదాపు ఎనిమిది మీటర్ల ఎత్తు, 28 మీటర్ల చుట్టుకొలతతో ఉన్న అండాకారపు శిలలో చక్కగా చేయబడిన ledge-cuts – మలచబడ్డ భాగాలు, post-holes – గుంజలవంటి వాటిని ఉంచడానికి వీలయ్యే పరిమాణంలో రాళ్ళలో చేయబడిన రంధ్రాలూ – ఇది చరిత్రపూర్వ యుగపునాటి మనుషులు ఈ రాళ్ళగుట్ట చుట్టూ ఏర్పరుచుకున్న వర్తులాకారపు  పంచగానో, ప్రార్ధనాస్థలంగానో ఉండిఉంటుందన్న విషయాన్ని గుర్తించి తెలియజెప్పిన వ్యక్తి ఒక మామూలు మనిషి, ఇక్కడి స్థానికుడు, పేరు శ్రీ కె. వెంకటేశ్వర రావు; ఈయన ఒక ‘freelance archaeologist’  అని ముచ్చటైన, గౌరవప్రదమైన మాటలతో ప్రస్తుతించింది ఆయనను The Hindu దినపత్రిక.
యూరోపు, ఆఫ్రికా దేశాలలో కనబడే ఈ రకపు నిర్మాణాల వంటిదే ఈ నిర్మాణం కూడా అని శ్రీ వెంకటేశ్వరరావుగారు ఈ మధ్యనే మొదటగా గుర్తించారు. ఎన్నాళ్ళుగానో అక్కడ ఆ స్థితిలో  ఉండిఉన్నా, ఎంతమంది అటుగా ఎన్నిమార్లో నడిచి వెళ్ళి ఉన్నా, ఇప్పటిదాకా వెలుగులోకి రాని  ఈ నిర్మాణం ప్రాముఖ్యాన్ని ఇప్పటికైనా ఈయన గుర్తించి తెలియజెప్పడం అన్నది ఎంతగానో ఆనందాన్ని కలిగించిన సంగతి. ఇది ఇప్పటికీ ఆంధ్ర దేశానికి చెందిన స్థలాలలో చరిత్రకు సంబంధించిన పరిశోధనకు ఉన్న మాసిపోని అవకాశాన్ని -scope ను – మరోసారి తెలియజేస్తుంది.
ఈ ఉదంతంలోని  ఇంకొక సంగతి ఏమిటంటే, ఈ నిర్మాణాన్ని ఇన్ని వందల, వేల ఏళ్ళుగా ఆ ప్రాంతపు స్థానికులు ‘పాండవులపంచ’, ‘పాండవులదొడ్డి’ , ‘దేముడురాళ్ళు’ అన్న మూడు విడి విడి పేర్లతో ఆ రాళ్ళ గుట్టలోని భాగాలను పిలుచుకుంటూనూ, పూజించుకుంటూనూ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చా రన్నది. పేరుకు తగినట్లుగానే, ‘పాండవులపంచ’ అనే దాంట్లో అయిదు పెద్ద పెద్ద శిలాతల్పాలు (rock beds) వున్నాయట. ఆంధ్రదేశ  జనుల నమ్మకంలో, ఈ ఆంధ్రదేశంలో పాండవులు తిరుగాడని గుట్టా, శ్రీరాములవారూ సీతమ్మా నడయాడని చోటూ లేదంటే అతిశయోక్తికాదని స్వర్గీయ ఆరుద్రగారు ఎక్కడో అన్నట్లు, ఈ ప్రదేశపు స్థలపురాణాన్ని ఇదివరకెవరైనా సేకరించే ప్రయత్నం చేసి వున్నట్లయితే (ఎప్పటి నుంచో చరిత్రపూర్వ యుగ జనావాసంగా ఉండిన) ఈ ప్రదేశంలో పూర్వం పాండవులు తమ వనవాసకాలంలో ఇక్కడ కొన్ని నాళ్ళు విడిది చేసి నివసించడం జరిగిందనీ ఆ కారణంగా ఈ గ్రామం  ‘చిట్టివలస’ అయిందనీ ఏ వృధ్దుడైనా చెప్పివుండేవాడేమో బహుశా! అది ఏమిటో, అక్కడ అలా ఎందుకుందో తెలియని ఎవరో ఒక మహానుభావుడు దూరం ఆలోచించి పాండవులపేర నామకరణం చేస్తే, అదలా స్థిరపడిపోయి జనుల మనసుల్లో ఒక పూజనీయమైన స్థలంగా మిగిలిపోయింది, సంరక్షించబడింది. అందువలన, చరిత్రలో అసలు సంగతులు తెలియాలంటే అడుగడుగే నెమ్మదిగా వేసుకుంటూ గ్రామాలకు వెళ్ళాలిసిందే, స్థానికులను కలవాలిసిందే. ఈ సంగతిని గ్రహించిన మెకంజీ మహాశయుడు తన మనుషుల చేత మొదటగా ఆ పనినే చేయించాడు.
మెకంజీ గారి గుమాస్తాలు ఊరూరా తిరిగి సేకరించిన స్థానికచరిత్రలన్నీ మెకంజీ కైఫియతులు అనే పేర నాలుగువందల పైగా వాల్యూములుగా మద్రాసు ప్రాచ్య లిఖిత భాండాగారంలో పదిలపరచ బడినాయి. వీటిలో విషయాలనే తిరుగ వ్రాయించి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీవారు 54 సంపుటాలుగా బైండింగు చేయించి తెలుగు విశ్వవిద్యాలయంలో భద్రపరిచారు. మెకంజీ కైఫియతులలో విషయాలను తెలుసుకోవాలంటే ఈ రెండు ప్రదేశాలలో ఏదో ఒకచోటికి వెళ్ళాలిసిందే. మెకంజీ గారి గుమాస్తాలు విషయాలను సేకరించి గ్రంథస్తం చేసిన విధం చరిత్ర పరిశోధన మీద మక్కువగల వారికీ, పాత విషయాలను తెలుసుకోవాలన్న కుతూహలం కలవారికీ ఎంతైనా ఆసక్తికరంగా  ఉంటుంది.  ఉదాహరణకు, వినుకొండ పరగణాలోని ‘పెదగాదెలవర్రు’ అనే గ్రామానికి సంబంధించి ఆ గ్రామపు దేశపాండ్యా ఇచ్చిన స్థానికచరిత్ర వివరం ఈ క్రింది విధంగా ఉంటుంది:
“పెదదింతినపాడు కు దగ్గరగా ఈశాన్య సరిహద్దుకు సమీపంలో జైన మతస్థులు నివాసముండిన ప్రదేశం ఉంది. కర్ణాటక ప్రభుత్వపు వడ్డి రెడ్డి హయాంలో జైనులు అక్కడినుంచి తరలి వెళ్ళిపోయారు. అప్పటినుంచీ ఆ ప్రదేశం ఒక దిబ్బగా మారింది. ఈ ప్రదేశానికి తూర్పున ఉన్న చుండూరు గ్రామస్తులలో కొందరు ఆ దిబ్బలోపలికి ఒక పాతర తవ్వి అందులో ధాన్యపు రాసులను పోగుచేసి దాచడం మొదలెట్టారు. పోనుపోను అది ఒక పెద్ద ధాన్యపు గాదె (store-house) గా మారింది. ఆ తరువాత చుండూరుకు చెందిన కొందరు గ్రామస్తులు ఆ ప్రదేశానికే వెళ్ళి అక్కడ ఇళ్ళను నిర్మించుకుని నివాసముండడం మొదలుపెట్టారు. తెలుగు భాషలో ధాన్యం నిలవవుంచే చోటుకు ‘గాదె’ అనే పేరుండడాన్ని బట్టి ఆ పల్లెటూరికి ‘పెద గాదెల వర్రు’ (great granary) అనే పేరు వచ్చింది.
మొగలులు ఈ ప్రదేశాన్ని జయించిన తరువాత, ఈ ప్రదేశం ఒక తాలుకా అయి, ఇరువురు మహమ్మదీయులకు జాగీరుగా ఇవ్వబడింది. ఆ తరువాతి కాలంలో ఈ ప్రాంతంలో ధనవంతులయిన కమ్మవారి ఆధ్వర్యంలో ఈ గ్రామంలో అమరేశ్వర స్వామి మరియు వేణుగోపాల స్వామి వార్ల దేవాలయాలు నిర్మించ బడినాయి.”
ఈ పాఠం యథాతథం కాదు; సంగ్రహంగా మాత్రమే!

ఆంధ్రదేశ చరిత్ర సంగ్రహము : శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మ -(5)

ఆంధ్రదేశ చరిత్ర సంగ్రహము : శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మగారి రేడియో ప్రసంగాల సంకలనం.
అయిదవ ప్రసంగం : కళింగము – గాంగయుగము
శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మగారి ఈ రేడియో ప్రసంగాల సంకలనంలో అయిదవ ప్రసంగం కళింగదేశాన్ని రమారమి క్రీ.శ.500 ప్రాంతం నుంచి 1437 దాకా, అంటే దాదాపు తొమ్మిదిన్నర శతాబ్ధుల కాలం పాటు అవిఛ్ఛిన్నంగా పాలించిన గంగవంశపు రాజులకు సంబంధించినది. ఈ ప్రసంగంలోని విషయం సంగ్రహంగా:
మధ్యాంధ్రదేశంలో తూర్పుజిల్లాలలోని పిఠాపురం మొదలుకుని ఉత్తరంవైపు మహానది దాకా వ్యాపించిన దేశాన్ని కళింగం అంటారు. కళింగానికి ఉత్తరంవైపు ఉండే దేశం ఉత్కలం, అంటే ఓడ్రదేశం, ఒరిస్సా. ఉత్తర కళింగము అనే పదమే వాడుకలో ఉత్కలము అనే పదంగా మారిందని భాషాశాస్త్రం తెలిసినవారంటారు. కళింగదేశపు పూర్వచరిత్ర తలచుకోగానే ముందు మనకు జ్ఞాపకం వచ్చేది దంతపురం – కళింగదేశ రాజధాని. బుధ్ధుని నిర్యాణానంతరం ఆయన దంతాన్ని తీసుకువచ్చి ఇక్కడ అందమైన స్తూపంలో పదిలపరిచారట. ఆ కారణంగా దంతపురానికి ఆ పేరు వచ్చింది. పూర్వకాలంలో కళింగదేశ ప్రజలు, ఏలిన రాజులు బౌధ్ధాన్ని అనుసరించినవారే.  బౌధ్ధం తరువాత జైనం కూడా ఈ దేశంలో వ్యాపించింది. కాని ప్రబలలేదు. జైనాన్ని మొట్టమొదట ఆదరించినవాడు, శాతవాహనరాజు శ్రీశాతకర్ణికి సమకాలికుడు అయిన ఖారవేల మహారాజు. ఇతడు చాలా పరాక్రమవంతుడు. మగధ రాజ్యం మీదికి ఎన్నో తడవలు దండెత్తివెళ్ళి ఆ మహారాజును ఓడించి తరిమివేసినవాడు. ఇతడు జైనమతాభిమాని. ఓడ్రదేశంలోని పూరీ జిల్లాలోని ఉదయగిరి, ఖండగిరి కొండలను తొలిపించి సుందరమైన గుహాలయాలను నిర్మింపజేసి జైన సన్యాసులకు సమర్పించాడు. ఇతని తరువాత కళింగదేశాన్ని పాలించిన వారు ఇతనంతటి పరాక్రమవంతులుకారు, జైనమతాభిమానులూ కారు. అందువలన ఖారవేలమహారాజు తరువాత జైనం కళింగదేశంలో పూర్తిగా అంతరించకపోయినా ప్రబలలేదు.
కళింగదేశమంతా కొండల, అడవుల మయం. ఇది యావత్తూ సముద్రపు ఒడ్డున ఉన్న దేశం. అందువలన అడవులు, కొండలు, సముద్రము – ఈ మూడిటి ప్రభావమూ కళింగదేశ చరిత్రమీద కనబడుతుంది. కొండల మధ్య లోయలలోనూ, సముద్రతీరపు పల్లపు ప్రదేశాలలోనూ బలము, ప్రతాపము కలవారు చిన్నచిన్న రాజ్యాలను స్థాపించుకుని తమకు వశమైన ప్రాంతాన్ని పాలిస్తూవుండేవారు. కళింగదేశం ఈ విధంగా ఉన్న అదనుచూసుకుని గుప్తవంశజుడైన సముద్రగుప్త చక్రవర్తి క్రీ.శ.350 ప్రాంతాన దండెత్తి వచ్చి, కళింగాన్నే కాక కంచివరకూ తూర్పు సముద్రతీరాన రాజ్యంచేసే రాజులందరినీ వోడించాడు. సముద్రగుప్తుని ఈ దండయాత్ర ఒక పెనుతుఫానులాగా దేశాన్ని భీభత్సం చేసినా అది ఎక్కువకాలం నిలవలేదు. శీఘ్రకాలంలోనే దేశం మళ్ళీ తేరుకుని, కుదుటపడి ఎప్పటిలాగే చిన్నరాజ్యాల పాలన సాగింది. సముద్రగుప్తుని దండయాత్ర జరిగిన నూరునూటయాభై సంవత్సరాలకు కళింగదేశంలో అడుగుపెట్టారు గంగవంశపు రాజులు.
సముద్రగుప్తుడి దండయాత్రలాంటి పరరాజ దండయాత్రలు జరిగినప్పుడూ, కరువుకాటకాలు సంభవించినప్పుడూ సముద్రతీర ప్రాంతంలోని వారు ఆ ఉపద్రవాలు తప్పించుకోవడానికి గానీ, బ్రతుకుతెరువు చూసుకునేందుకు గానీ సముద్రంమీద తూర్పుదేశాలకూ, ద్వీపాలకూ సబురు వెళ్ళేవారు. ఓడ ప్రయాణాన్ని సబురు అంటారు. సముద్రతీర ప్రాంత కళింగదేశ వర్తకులు వ్యాపారంకోసంగా తూర్పుదేశాలయిన బర్మా, కంబోడియా, మలయా ద్వీపకల్పము, సుమాత్రా, జావా, బాలి మొదలయిన దేశాలకూ ద్వీపాలకూ సబురులు చేసేవారు. పూర్వకాలంలో బర్మా, మలయాద్వీపకల్పమూ, సుమాత్రా, జావాల నదీతీరాలలో బంగారపు ఇసుక దొరికేదనీ, కొండప్రాంతాలలో బంగారపు గనులు ఉండేవనీ, ఆ కారణం చేత ఈ దేశాలకూ, ద్వీపాలకూ సువర్ణభూమి అనీ, సువర్ణద్వీపమనీ పేరువచ్చిందనీ చెబుతారు. ఇక్కడ బంగారమే కాకుండా, వెండి, తగరం, అగరు, కర్పూరం, ఇతర సుగంధద్రవ్యాలు కూడా పుష్కలంగా లభ్యమయ్యేవి. మనదేశ రాజుల రాజభోగాలకు ఈ సుగంధద్రవ్యాలు, వెండి బంగారాలూ కావలసి వచ్చేవి. మనదేశ వర్తకులు సాహసంతో ధ్రువనక్షత్రాన్ని దిక్కులు తెలిపే సాధనంగా చేసుకుని ఓడలమీద సబురులు చేసి ఈ సరుకులన్నీ తెచ్చేవారు. దక్షిణహిందూ దేశంలోని తూర్పుతీరంలో ఈ విధమైన ఓడలమీద వర్తకం సువర్ణభూమితో మొట్టమొదటగా చేసినవారు కళింగదేశీయులే. చీనా దేశ వర్తకులూ, మనదేశ వర్తకులూ ఈ సువర్ణభూమిలో కలుసుకునేవారు. ఆ కాలంలో వర్తకం అంటే ఇక్కడినుంచి తీసుకువెళ్ళిన సరుకులను అక్కడ ఇచ్చి, అక్కడి సరుకులను ఇక్కడికి తేవడంగా ఉండేది. క్రీ.శ.మూడవ, నాలుగవ శతాబ్దములనాటి తమ దేశచరిత్రలో చీనా వారు తాము సువర్ణభూమిలో కళింగదేశ వర్తకులను కలుసుకున్నామనీ, అక్కడి వర్తకమంతా కాళింగులతోనే అనీ వ్రాసుకున్నారు. అప్పటి ఒక కళింగ వర్తకుడు చీనా దేశానికి కూడా వెళ్ళాడట! కళిగం నుంచి తూర్పు సముద్రాల మీదుగా చీనావెళ్ళి రావడానికి నాలుగేళ్ళు పట్టేదట! కళింగ వర్తకులు ఒక్కొకరు తెగించి ఇరవై, నలభై, ఎనభై, వంద, రెండు వందలు ఓడలు కట్టుకుని వర్తకానికి వెళ్ళేవారట. దేశంలో ఉపద్రవం సంభవించినప్పుడు కళింగదేశ జనం గుంపులు కట్టుకుని సముద్రం మీద ఓడలలో పడడమే. సముద్రప్రయాణం అంటే భయం కాని, పిరికితనంగానీ ఉండేది కాదు. కళింగ దేశం నుంచి ఆ దేశాలకు వెళ్ళినవారు అక్కడ వారు నివసించిన ప్రదేశాలకు కళింగమనే పేరు పెట్టుకున్నారు. ఇట్టివారిలో ఆ దేశాలలో ద్వీపాలలో రాజ్యాలు స్థాపించి రాచరికం చేసినవారూ వున్నారు. జావాను క్రీస్తుశకం ఎనిమిది, తొమ్మిది, పదవ శతాబ్దులలో పాలించిన శైలేంద్రవంశపు రాజులు కళింగదేశీయులే.
శైలేంద్రులు జావాలో రాచరికం చేస్తున్న కాలంలో కళింగాన్ని పాలించిన వారు గంగవశీయులు. పశ్చిమ, తూర్పు గంగరాజులని వీరివి రెండు కోవలు. పశ్చిమ గంగవంశ రాజులు మైసూరులో పాలించారు. తూర్పు గంగవంశరాజులు కళింగాన్ని పాలించారు. పూర్వం మైసూరునుంచి పాలించిన గంగవంశరాజులలో ఓ ఐదుగురు తమ బలపరాక్రమాలతో రాజ్యం సంపాదించుకోవాలని బయలుదేరి దేశాలు తిరుగుతూ కళింగానికి వచ్చి అక్కడ మహేంద్రగిరిపై వెలిసి ఉన్న గోకర్ణస్వామిని ఆరాధించి ఆయన అనుగ్రహంతో అక్కడి రాజులను జయించి కళింగ దేశంలో గంగరాజ్యం స్థాపించారు. వీరు కళింగాన్ని క్రీ.శ.500 ల ప్రాంతం నుండి 1400 ప్రాంతం దాకా కళింగానికి ఏలికలుగా ఉన్నారు. వీరిలాగా అవిఛ్ఛిన్నంగా తొమ్మిదివందల సంవత్సరాలపైని రాజ్యమేలిన వంశం దక్షిణహిందూదేశంలో మరొకటి కనబడదు. పూర్వకాలం నుంచి కళింగదేశ అడవులు శ్రేష్ఠమైన ఏనుగులకు ప్రసిధ్ధి. కళింగదేశ రాజుల సైన్యంలో ఎక్కువగా ఏనుగులు ఉండడంవలన వీరికి గజపతులు అనే పేరు వచ్చింది.
ఈ గంగవంశరాజులలో కళింగాన్ని క్రీస్తుశకం వెయ్యవ సంవత్సరానికి ముందు పాలించినవారిని ప్రాచీన గాంగరాజులనీ, ఆ తరువాతి వారిని అర్వాచీన గాంగరాజులనీ చరిత్రకారులు అంటారు. మొదటివారికంటే తరువాతివారే చాలా ప్రతాపవంతులు. వీరిలో వజ్రహస్తదేవుడు మొదటి మహారాజు. ఇతని కొడుకు రాజరాజదేవు, మనుమడు అనంతవర్మ చోడ గంగదేవుల రాజ్యకాలంలో వీరికీ చోళమహారాజులకూ చాలా యుధ్ధాలు జరిగాయి. గంగరాజులందరిలోనూ అనంతవర్మ చోడగంగదేవు చాలా ప్రసిధ్ధుడూ, పరాక్రమశాలీను.
గంగవంశంవారి రాజ్యం ఒకప్పుడు ఉత్తరాన గంగానది వరకు, దక్షిణాన గోదావరివరకూ వ్యాపించింది. రాజ్య సంపాదన, సంరక్షణ ప్రయత్నంలో గంగవంశపు రాజులకూ అటు ఉత్తరంవైపు బంగాళాదేశాన్ని పాలించిన నవాబులతోనూ, పడమటి వైపు చేదిరాజులతోనూ, దక్షిణంవైపు చాళుక్య చోళులతోనూ, కొండవీటి రెడ్డిరాజులతోనూ తరచుగా యుధ్ధాలు సంభవించేవి. ఈ వంశం వారిలో నాలుగవ భానుదేవు కళింగాన్ని పాలించిన చివరి రాజు. వీరి పాలన క్రీ.శ.1437లో అంతరించింది.
గంగవంశపు రాజులలో మొదటివారు శైవులు; తరువాతి వారు వైష్ణవులు. వీరు గొప్ప దేవాలయాలను నిర్మింపజేశారు. ముఖలింగం, శ్రీకూర్మం దేవాలయాలు వీరు కట్టించినవే. పూరి జగన్నాధాలయన్ని కట్టించినవాడు అనంతచోడ గంగదేవు. కోణార్క లోని సూర్యదేవాలయాన్ని కట్టించినది నరసింహదేవు. అద్భుతాలయిన ఈ కట్టడాలతో కళింగ గాంగవంశపు రాజులు ఉత్కలానికి అందం తెచ్చారు. వేములవాడ భీమకవి అనంతవర్మ చోడగంగదేవు తండ్రి అయిన రాజరాజదేవుకు సమకాలికుడని చెబుతారు. ఈ గాంగరాజులు వేదవిద్యలను, కళలను పోషించి కీర్తిగడించారు.

ఆంధ్రదేశ చరిత్ర సంగ్రహము : శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మ -(4)

ఆంధ్రదేశ చరిత్ర సంగ్రహము : శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మగారి రేడియో ప్రసంగాల సంకలనం.
నాలుగవ ప్రసంగం : పూర్వ చాళుక్యయుగము
తెలుగునేలన చిన్నచిన్న రాజ్యాల కాలంపోయి, వేంగీ చాళుక్యుల ఆగమనంతో పెద్దరాజ్యాల యుగం ప్రారంభమయింది. చాళుక్యుల ఆగమనంతో తెలుగుదేశ చరిత్రలో ఒక నూతన అధ్యాయం అరంభమయింది. ఈ దశ ఆరంభ కాలం నుంచి రాజరాజనరేంద్రుని కాలం దాకా దాదాపు నాలుగుశతాబ్దాలకు పైగా కాలంలో జరిగిన చరిత్ర సంగతులను ఈ నాల్గవ ప్రసంగంలో క్లుప్తంగా నిక్షిప్తం చేశారు శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మగారు. ఈ ప్రసంగంలోని విషయం సంగ్రహంగా:
విష్ణుకుండివంశపు రాజుల తరువాత పూర్వాంధ్రదేశాన్ని ఆక్రమించుకుని పాలించినవారు చాళుక్యవంశ క్షత్రియులు. వాతాపి, ఇప్పటి బాదామి వీరికి మొదట రాజధాని. ఈ వంశంలోని సత్యాశ్రయుడనే రెండవ పులకేశిమహారాజు, ఉత్తర హిందూదేశాన్ని ఏలిన హర్షవర్ధనుడూ సమకాలీనులు. దక్కునుదేశం మీదికి దండెత్తి వచ్చిన హర్షవర్ధనుని ఓడించిన పరాక్రమవంతుడు సత్యాశ్రయుడు. దక్కనుదేశంలోని తన ఇరుగుపొరుగు రాజులనందరినీ ఓడించి అప్పటివరకూ ఒక చిన్న సంస్థానంగా ఉంటూ వచ్చిన బాదామిని గొప్ప చాళుక్య సామ్రాజ్యంగా విస్తరింపజేశాడు. ఆ తరువాత దిగ్విజయయాత్ర మొదలుపెట్టి యవరాజయిన తన తమ్ముడు విష్ణువర్ధనునితో కూడా ఆంధ్ర దేశంమీదికి దండెత్తివచ్చి, జయించి, తమ్ముడయిన విష్ణువర్ధనుని వేంగీదేశానికి తన ప్రతినిధిగా నియమించి వేంగీదేశంలో చాళుక్యరాజ్య స్థాపన చేశాడు. తూర్పుదేశాన్ని పాలించిన చాళుక్యులన్న పేరుతో తూర్పుచాళుక్యులనీ, పూర్వచాళుక్యులనీ వీరికి పేరు వచ్చింది. మొడట అన్నగారికి ప్రతినిధిగా ఉన్నప్పటికీ, తరువాత క్రీ.శ.625లో విష్ణువర్ధనుడు స్వతంత్రుడై రాజ్యం పాలించాడు. ఇతనికి గూను ఉండడంవలన కుబ్జవిష్ణువర్ధనుడనీ పేరు. ఇతని కొడుకు జయసింహవల్లభ మహారాజుకు సర్వసిధ్ధి అని పేరు. విశాఖపట్టణం జిల్లాలోని సర్వసిధ్ధి ఇతనిపేర కట్టినదే.
శాతవాహనుల కాలం నుంచీ వేంగీచాళుక్యుల దాకా గల రమారమి తొమ్మిదివందల సంవత్సరాల నడిమి కాలంలో మనదేశంలో చాలాభాగం అడవి తెగిపోయి ఆ ప్రాంతం అంతా జనులకు నివాసయోగ్యంగా చేయబడింది. పాడిపంటలు వృధ్ధిచేయబడ్డాయి. ప్రాంతాల మధ్య రాకపోకలు పెరిగి, వ్యాపారం పెరిగింది. చిన్నచిన్న రాజులు సంస్థానాలు కట్టుకుని విడివిడిగా పాలించే కాలం పోయి, జనసమృధ్ధమూ, సస్యసంపన్నమూ అయిన దేశాన్ని అంతా తమ ఆధినంలోనికి తెచ్చుకుని పాలించే పెద్ద రాజ్యల కాలం వచ్చింది. పూర్వాంధ్రదేశం అంతా చాళుక్యుల పాలనలో ఉంటే, వారికి పొరుగున కాంచీపురం రాజధానిగా పల్లవరాజ్యం విలసిల్లింది. పశ్చిమాంధ్రలోని కొంతభాగం వారి పాలనలో ఉండేది. బాదామిని సత్యాశ్రయమహారాజు సంతతివారు క్రీ.శ.ఎనిమిదవ శతాబ్ది మధ్యవరకు పాలించారు. అటుతరువాత వారిని జయించి రాష్ట్రకూటులు మాల్యఖేటము – నేటి మాల్ఖేడు - రాజధానిగారెండువందల సంవత్సరాలదాకా అంటే క్రీ.శ.పదవ శతాబ్ది మధ్య దాకా పాలించారు. ఇందువలన వేంగీ చాళుక్యులకు పడమటి దిక్కున వారికి జ్ఞాతులైన బాదామి చాళుక్యులు, అటు తరువాత మాల్యఖేటం రాష్ట్రకూటులూ సమకాలికులయ్యారు. తమ రాజ్యారంభకాలం నుంచీ రాష్ట్రకూటులు తమ రాజ్యాన్ని తూర్పు సముద్రతీరానికంతా వ్యాపింపజేయాలని ప్రయత్నిస్తూనే వచ్చారు. ఈ కారణంగా వేంగీ చాళుక్యులకూ రాష్ట్రకూటులకూ మధ్య చాలా యుధ్ధాలు జరిగాయి. ఒక సందర్భంలో ఈ యుధ్ధం పన్నెడేండ్ల పాటు సుదీర్ఘంగా కొనసాగింది. ఉభయవంశాల రాజులకూ మధ్య ఈ యుధ్ధాలు చాళుక్యవంశంలోని తైలపరాజు రాష్ట్రకూట రాజ్యన్ని పూర్తిగా కూలదోసి మళ్ళీ చాళుక్యవంశాధికారాన్ని పునఃప్రతిష్ఠించేదాకా సాగాయి. తైలపుని సంతతివారిని చరిత్రలో పశ్చిమ చాళుక్యులని అంటారు. వీరికి కళ్యాణి నగరం రాజధాని.
వేంగీచాళుక్యులలో పరాక్రమవంతులైన రాజులెందరో ఉన్నారు. వీరిలో చాలా మందికి విష్ణువర్ధనులనీ, విజ్యాదిత్యులనీ పేర్లుగా ఉండేవి. వీరిలో క్రీ.శ.844 నుండి 892దాకా పాలించిన మూడవ విజయాదిత్యమహారాజు రాష్ట్రకూటులతోడి యుధ్ధాలలో వారిని చాలాసార్లు ఓడించి వీరాధివీరుడనే పేరు గడించాడు. నాలుగవ విజయాదిత్యుని కొడుకైన అమ్మరాజ రాజమహేంద్రుడు తనపేర నేటి రాజమహేంద్రవరాన్ని కట్టించాడు. పూర్వచాళుక్య వంశపు రాజులు సంతానసమృధ్ధి కలవారు. అందువలన విష్ణువర్ధనుని వంశం శాఖోపశాఖలై వర్ధిల్లింది. అయితే, జ్ఞాతితగాదాలు, కుట్రలూ, యుధ్ధాలు కూడా ఈ కారణంగా సంభవించాయి. ఇందులో భాగంగానే ఈ వంశంవారు కొందరు పొరుగున వున్న రాష్ట్రకూటుల సహాయాన్ని పొందుతూ వచ్చారు. రాష్ట్రకూటులు తరచుగా పూర్వచాళుక్యులమీదికి దండెత్తిరావడానికి ఇది అవకాశం కల్పించింది. ఈ జ్ఞాతి తగాదాలు ఈ వంశంలో క్రీ.శ.వెయ్యవ సంవత్సరందాకా సాగుతూనే వచ్చాయి.
పశ్చిమ చాళుక్య ప్రభువైన తైలపుని విజయం తరువాత రాష్ట్రకూట రాజ్యం పడిపోయి పశ్చిమచాళుక్యులు తమ అధికారాన్ని పునఃప్రతిష్టించుకున్న తరువాతి సంధికాలంలో, పల్లవరాజుల తరువాత క్రీ.శ.పదవ శతాబ్దంలో అరవదేశాన్ని ఆక్రమించుకుని పాలించిన చోళ మహారాజులు రాజరాజు, అతని కొడుకైన రాజేంద్రచోడుడు మొదలైనవారు పూర్వచాళుక్యుల రాజకీయవ్యవహారాలలో ఈ అంతఃకలహాలవలననే జోక్యం కలుగజేసుకోవడం సంభవించింది. పూర్వకాలంలో పల్లవులకు, రాష్ట్రకూటులకులాగే, ఈ చోళరాజులకు పశ్చిమచాళుక్యులకు మధ్య రాజ్యసంపాదనకోసం కలహాలు పెరిగి వారి ఉభయుల మధ్య చాలాకాలం యుధ్ధాలు జరిగాయి. ఈ యుధ్ధాలలో పూర్వాంధ్రదేశం తమ పక్షాన లేకుంటే, తమ రాజ్యానికి క్షేమంలేదని చోళభూపతులు పూర్వచాళుక్యులతో స్నేహంకట్టవలసిన అవసరం కలిగి, వేంగి రాజ్యకీయ వ్యవహారాలలో కలుగజేసుకున్నారు. జ్ఞాతి కలహాలవల్ల రాజ్యం పోగొట్టుకున్న శక్తివర్మనూ, అతని సోదరుడైన విమలాదిత్యుని తిరిగి వేంగీ సింహాసనంమీద కూర్చోబెట్టారు. అంతేకాకుండా, వేంగీచాళుక్యులను తమ పలుకుబడికింద ఉంచుకునే నిమిత్తం చోళమహారాజులు వారి ఆడుబిడ్డలను చాళుక్య మహారాజులకు ఇచ్చి పెళ్ళిళ్ళు చేశారు. రాజరాజచోళ మహారాజు తన సోదరి అయిన కుందవాంబను శక్తివర్మ సోదరుడైన విమలాదిత్యునకిచ్చి వివాహం చేశాడు. ఈ దంపతులిద్దరికి పుట్టినవాడే మన రాజరాజనరేంద్రుడు. ఇతడు మళ్ళీ రాజేంద్రచోళుడి కూతురు అమ్మంగదేవిని వివాహం చేసుకున్నాడు; క్రీ.శ.1022లో వేంగీ సింహాసనాన్ని అధిష్ఠించాడు. నన్నయభట్టారకులవారు ఈ రాజరాజనరేంద్రుని ఆస్థానకవి.
వేంగీ చాళుక్యుల కాలంలో మనదేశంలో వేదమతం బాగా బలపడింది. వేదమత సంప్రదాయమైన శైవానికి జనాదరణ పెరిగింది. బౌధ్ధం పూర్తిగా పోయి, జైనానికి కొంత పట్టు దొరికింది. అత్తిలి, బెజవాడ, ధర్మవరం, తాటిపాక, పెనుగొండ మొదలైనవి ఆ కాలంలో గొప్ప జైనక్షేత్రాలుగా ఉండేవి. చాళుక్యరాజులు జైనులను, బ్రాహ్మణులను సరిసమానంగా ఆదరించారు. జైన మఠాలకు కూడా భూదాన, అగ్రహార దానాలు చేశారు. ఈ కాలంలో బ్రాహ్మణులు రాజగురువులై, ఉపదేశికులై, మంత్రులై రాజకార్యాలలో నియమితులవుతూ వచ్చారు. ఇట్టివారికి నియోగులనిపేరు. బ్రాహ్మణులలో వేదాలు, శాస్త్రాలు చదువుకొన్న గొప్ప పండితులనేకులు ఉండేవారు. యుధ్ధాలలో పాల్గొని గొప్ప కీర్తి గడించిన సేనాధిపతులూ ఉండేవారు. చాళుక్యుల కాలంలో వర్తకవ్యాపారాలు విరివిగా సాగాయి. మనదేశ వర్తకులు తూర్పు దేశాలతోనూ, ద్వీపాలతోనూ ఓడలలో వర్తకం బాగా చేసేవారు.
తెలుగుభాష క్రమంగా వృధ్ధి చెంది ఈ కాలంలో ననలు తొడిగింది. కవులు తెలుగులో పద్యాలు, పదాలు వ్రాస్తూ వచ్చారు. తెలుగుభాషలో పద్యాలు మొట్టమొదటిమారు మూడవ విజయాదిత్య మహారాజు కాలంనుంచీ, అతని తమ్ముని కొడుకైన భీమమహారాజు కాలంనుంచీ కనబడతాయి. అప్పటికే కవిత్వం చెప్పడానికి తెలుగు అనుకూలమైన భాషగా తయారయింది. రాజరాజనరేంద్రుని కాలం నాటికి తెలుగులో ధారాళంగా పద్యాలు వ్రాయడం వచ్చింది. అందువలననే, ఆ మహారాజు ఆస్థానకవియైన నన్నయగారు సంస్కృతమహాభారతాన్ని పద్యాల రూపంలో తెలుగులోకి తర్జుమా చేశారు. ఇంతవరకు దొరికిన తెలుగు గ్రంథాలలో నన్నయ్యగారు వ్రాసిన ఆంధ్రమహాభారతమే మొదటిది.

ఆంధ్రదేశ చరిత్ర సంగ్రహము : శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మ -(3)

ఆంధ్రదేశ చరిత్ర సంగ్రహము : శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మగారి రేడియో ప్రసంగాల సంకలనం.
మూడవ ప్రసంగం : చిన్న రాజ్యాల కాలం
శ్రీ మల్లంపల్లి సొమశేఖరశర్మగారి రేడియోప్రసంగాలలోని మూడవ ప్రసంగం ఆంధ్రదేశంలో  చిన్న రాజ్యాల కాలం వారి పరిపాలన, ఆ కాలంలో ఆంధ్రదేశంలో వచ్చిన సాంఘికమైన, సాంస్కృతికమైన మార్పుల గురించినది. చిన్న రాజ్యాల కాలం అంటే, ఆంధ్ర దేశం బృహత్ఫలాయన, శాలంకాయన, కందార, పల్లవ, విష్ణుకుండు ఇత్యాది రాజవంశాలకు చెందిన  రాజుల పరిపాలనో ఉండిన కాలం. ఈ ప్రసంగ విషయం సంగ్రహంగా:
కృష్ణానదికి ఉత్తరానను, గోదావరికి దక్షిణానను ఉన్న భూభాగాన్ని ఇక్ష్వాకుల తరువాత రెండు రాజవంశాలు పరిపాలించాయి. అవి ఒకటి: బృహత్ఫలాయనులు, రెండు: శాలంకాయనులు. వీరిని చరిత్రలో బృహత్ఫలాయన గోత్రులనీ, శాలంకాయన గోత్రులని కూడా పిలుస్తారు. బృహత్ఫలాయనులకు కృష్ణాజిల్లా బందరు దగ్గరలోని గూడూరు రాజధాని. ఈ వంశపు రాజులలో మనకు ఇంతవరకు తెలిసిన రాజు ఒక్కడే, అతడు జయవర్మ.
శాలంకాయనులు ఆంధ్రదేశాన్ని ఒక వంద సంవత్సరాలదాకా పాలించారు. ఈ వంశంవారికి నేటి పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరుకు దగ్గరిలోని పెదవేగి రాజధాని. వీరి పరిపాలనా కాలంలో పెదవేగి మహానగరం. ఈ నగరం రాజధానిగా ఈ ప్రాంతాన్ని పరిపాలించిన శాలంకాయన రాజులు దేవవర్మ, హస్తివర్మ, నందివర్మ, చండవర్మ, స్కందవర్మ మొదలైన రాజులు  చాలామంది ఉన్నారు. వీరంతా చిత్రరథస్వామి భక్తులు. చిత్రరథస్వామి అంటే సూర్యభగవానుడు. పెదవేగిలో పూర్వం పెద్ద చిత్రరథస్వామి దేవాలయం ఉండేదట.
ఇక్ష్వాకురాజ్యం అంతరించిన తరువాత కృష్ణకు దక్షిణాన వున్న దేశం మొదట కందారవంశపు రాజులకు, ఆ తరువాత కంచి రాజధానిగా పరిపాలిస్తూ ఉండిన పల్లవ వంశ రాజుల పరిపాలనలోకి వెళ్ళింది. కందార వంశం రాజులలో దామోదరవర్మ, అత్తివర్మ అనేవారు ప్రసిధ్ధులు. అయితే, వారి రాజ్యంకూడా ఎక్కువకాలం నిలబడలేదు. ఆ తరువాత పల్లవ వంశపు రాజులే కృష్ణానదికి దక్షిణాన ఉన్న పూర్వాంధ్రదేశాన్ని చాలాకాలం పాలించారు.
వీరకూర్చవర్మ, విష్ణుగోపవర్మ, స్కందవర్మ, వీరవర్మ, సింహవర్మ, బుధ్ధవర్మ, నందివర్మ మొదలైనవారు అనేకులు పల్లవరాజులలో పరాక్రములైన రాజులు ఉన్నారు. శాలంకాయనులు వేంగీదేశాన్ని పాలిస్తూన్నపుడు కృష్ణకు దక్షిణదేశాన్ని పల్లవరాజులు పాలిస్తూండేవారు. వారి పరిపాలన ప్రారంభ సంవత్సరాలలో  సముద్రగుప్త చక్రవర్తి దండెత్తివచ్చి శాలంకాయన హస్తివర్మనూ, పల్లవ విష్ణుగోపవర్మనూ జయించాడు. అయితే, సముద్రగుప్త చక్రవర్తి తిరిగి ఉత్తరభారతానికి తరలి వెళ్ళగానే వీరు స్వతంత్రులై తమతమ రాజ్యాలను ఏలుకున్నారు.
శాలంకాయన రాజుల పాలన తరువాత పూర్వాంధ్రదేశాన్ని విష్ణుకుండిన రాజులు పాలించారు. విష్ణుకుండిన రాజులు శైవులు, వేదమతాభిమానులు. వీరు తమకు పొరుగున దక్కనులో పాలిస్తూవచ్చిన వాకాట వంశం వారితోనూ, మధ్య గణాలలోని తేవారు ప్రాంతపు రాజులతోనూ ముందుచూపుతో  వివాహ సంబంధాలు కుదుర్చుకుని తమ రాజ్యాధికారానికి పొరుగురాజ్యాలవల్ల ఆపద రాకుండా కాపాడుకున్నారు.
తమకు పూర్వం పాలించిన రాజవంశాలందరికంటే ఈ విష్ణుకుండివంశపు రాజులు బాగా బలపరాక్రమములు కలవారు. మొదట వీరు కృష్ణకు దక్షిణాన ఉన్న దేశాన్ని వశపరుచుకుని పాలించినప్పటికీ, కాలక్రమేణా బలవంతులైన పల్లవరాజుల వలన ఒత్తిడి ఎక్కువై, చివరకు వేంగీ దేశానికి వెళ్ళిపోయి అక్కడ వేగికి సమీపంలోని దెందులూరు రాజధానిగా చేసుకుని పాలించారు. విష్ణుకుండివంశంవారివి ఇంతవరకు ఐదు రాగి శాసనాలు దొరికాయి. వీటినిబట్టి చూస్తే విష్ణుకుండి వంశంవారు క్రీస్తుశకం అయిదవ శతాబ్ది చివరిభాగం నుండి ఏడవ శతాబ్దం మొదటి భాగం దాకా, అంతే సుమారు నూటయాభై సంవత్సరాలదాకా పాలించారని తెలుస్తుంది.
విష్ణుకుండివంశం రాజులలో మాధవవర్మ మహారాజు చాలా పరాక్రమవంతుడు. ఈయన కాలంలో విష్ణుకుండులు కళింగంలోని కొంతబాగాన్నికూడా జయించి తమరాజ్యంలో కలుపుకుని పాలించారు. బాదామి చాళుక్య వంశంవాడైన రెండవ పులకేశిమహారాజూ, అతని తమ్ముడు యువరాజు విష్ణువర్ధనుడు వేంగిదేశంపైకి దండెత్తి వచ్చి జయించి తమరాజ్యాన్ని అక్కడ స్థాపించేదాకా ఈ విష్ణుకుండిరాజుల పాలన సాగింది.
ఇక్ష్వాకువంశపు రాజుల పాలన నుండి విష్ణుకుండిరాజుల పాలన సమాప్తి వరకూ అయిన సుమారు రెండువందల సంవత్సరాల మధ్యకాలంలో ఆంధ్రదేశంలో సామాజికంగానూ, సాంస్కృతికంగానూ కొన్ని ముఖ్యమైన మార్పులు వచ్చాయి. ఉత్తరదేశాన్నుంచి వచ్చిన ఆంధ్రులలోని వేరువేరు తెగలవారు ఇక్కడ స్థిరపడిన తరువాత, అనాదిగా ఇక్కడ నివసిస్తూండిన స్థానిక తెగలవారితో వివాహసంబంధాలు పెట్టుకోవడం వలన సాంఘికంగా ఒక గొప్ప మార్పు వచ్చి ఒక మహా సంఘ నిర్మాణానికి దారితీసింది. ఇక మత పరంగా చెప్పాలంటే – మనదేశంలోని జనులలో ముప్పాతికమువ్వీసం మంది ప్రాచీనకాలంనుంచీ బుధ్ధమతావలంబకులు. బుధ్ధుని నిర్యాణం తరువాత కొంతకాలానికి అతనికి పూజ ఏర్పడి, దేవుడుగా చేయబడ్డాడు.  ఆ తరువాత కొంతకాలానికి బుధ్ధుడు ప్రధాన దేవుడై, మరికొందరు ఇతర దేవుళ్ళు ఏర్పడ్డారు. ఈ దేవుళ్ళకు భార్యలు, దేవతలు ఏర్పడినారు. వీరి ఉభయుల సంఖ్యా నానాటికీ హెచ్చింది. వీరికి విగ్రహాలు ఏర్పడి మొదట దేవుడే లేదనే మతంలో విగ్రహారాధన మొదలయ్యింది. ఈ విగ్రహాలను పూజించే పధ్ధతులు అనేకం వచ్చాయి. వీటికి తిరునాళ్ళూ, ఉత్సవాలు ఏర్పడి, రానురాను హెచ్చి స్త్రీ పురుష బౌధ్ధ సన్యాసుల ప్రవర్తనలపై అభ్యంతరకరమైన ప్రభావాన్ని చూపాయి.
క్రమంగా బౌధ్ధం ఆదరాభిమానాలను కోల్పోయింది. ఈ సమయంలో ఇక్ష్వాకు తదితర రాజవంశాలు ఇచ్చిన ప్రోత్సాహంతో వేదమతం తిరిగి ప్రజలలో ప్రబలడం మొదలయింది. శాతవాహనులూ, ఆ తరువాత పాలించిన ఇక్ష్వాకులు తదితర చిన్నచిన్న రాజవంశాల రాజులు అందరూ వేదమతాన్నిఅవలంబించినవారే. ఈ రాజవంశాలలోని రాజులలో అశ్వమేధయాగం చేసిన రాజు వంశానికి ఒక్కరైనా ఉన్నాడు. విష్ణుకుండి రాజులలో మాధవవర్మ అనే రాజు ఒక్కటికాదు, పదకొండు అశ్వమేధ యాగాలు చేశాడట! దీనిని బట్టి ఆ కాలంలో యజ్ఞాలూ, యాగాలపై మోజు హెచ్చిందనీ, అది ఒక ఘనతగా కూడా తయారయిందనీ అనుకోవచ్చు. యజ్ఞయాగాది వేదకర్మలను చేయించే బ్రాహ్మణులకు దీనివలన ప్రాపకమూ, ఆదరణా సహజంగానే హెచ్చింది. ఇరుగుపొరుగు దేశాలనుండి బ్రాహ్మణులనేకులు రాజాశ్రయం వెదుకుకుంటూ ఈ దేశం వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవడానికీ ఇది దారితీసింది. వేద, శాస్త్రపారంగతులైన బ్రాహ్మణులకు  దానాలను చేసి, వాటిని రాగిరేకుల మీద చెక్కించి ఇచ్చారు. ఇక్ష్వాకు వంశం వారి రాజ్యం అంతరించినప్పటినుంచీ మనకు దొరికిన భూదాన శాసనాలన్నీ రాగిరేకులమీద చెక్కినవే!
దేశంలో బౌధ్ధమతం క్రమంగా క్షీణించినకొలదీ శైవమతం ప్రబలింది. దీని తరువాతనే వ్యాప్తి చెందింది వైష్ణవమతం. శైవమతానికి ఆధిక్యం కలిగిన కాలంలో ఇప్పటి శ్రీశైలం గొప్ప శైవక్షేత్రమై శ్రీపర్వతం అన్న పేరుతో ప్రసిధ్ధికెక్కింది. ఆ కొండమీద వెలసిన శివునికి శ్రీపర్వతస్వామి అని పేరు సార్ధకమయింది. విష్ణుకుండి వంశపు రాజులు శ్రీపర్వతస్వామి పాదాలు కొలిచి వృధ్ధిచెందిన వారు.  ఈ కాలంలో ప్రాకృతం, ప్రాకృతకవులకు ఆదరణ సన్నగిల్లింది. సంస్కృత భాషకు, సంస్కృత కవులకూ ఆదరణ హెచ్చింది. తెలుగు భాష రేఖ ఈ కాలంలోనే క్రమంగా బయలుపడింది.

ఆంధ్రదేశ చరిత్ర సంగ్రహము : శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మ -(2)

ఆంధ్రదేశ చరిత్ర సంగ్రహము : శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మగారి రేడియో ప్రసంగాల సంకలనం.
రెండవ ప్రసంగం : బౌధ్ధయుగము – ఇక్ష్వాకులు
శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మగారి రేడియోప్రసంగాలలోని రెండవ ప్రసంగం ఆంధ్రదేశంలో ఇక్ష్వాకువంశ రాజుల పరిపాలన, వారికాలంలో ఆంధ్రుల సంస్కృతిని గురించినది. . ఈ ప్రసంగంలోని విషయం సంగ్రహంగా:
శాతవాహన రాజుల పరిపాలన చివరి రోజులలో (అంటే క్రీ.శ.మూడవ శతాబ్దం ప్రథమార్ధంలో) ఆ సామ్రాజ్యంలోని వేరువేరు ప్రాంతాలలో నివసించే ప్రజలను కూడగట్టుకుని బలపరాక్రమాలుగల వీరులు విజృంభించి వేరువేరు ప్రాంతాలలో చిన్నచిన్న రాజ్యాలు స్థాపించారు. ఈ విధమైన స్వతంత్ర రాజ్యాల స్థాపనతో శాతవాహన సామ్ర్యాజ్యం చితికి చిదపలై చివరికి అంతరించిపోయింది. ఇలా తెలుగునేలనే వెలసిన చిన్నరాజ్యాలలో ఇక్ష్వాకు వంశమువారి రాజ్యం ఒకటి.
ఇక్ష్వాకు వంశంకూడ పురాణ ప్రసిధ్ధి చెందిన వంశం.  ఈ వంశపు రాజులు క్షత్రియులు. వీరిని గురించి తెలిసినదల్లా వీరికాలంలో రాళ్ళమీద వేయించిన శాసనాలవలననే. ఇక్ష్వాకుల కాలంనాటి శాసనాలు ముఖ్యంగా కృష్ణాజిలా, నందిగామ తాలుకా జగ్గయ్యపేటలోను, గుంటూరు జిల్లా పల్నాడు తాలూకా నాగార్జునకొండలోనూ దొరికాయి. ఈ శాసనాలన్నీ బౌధ్ధస్తూపాలలోని రాళ్ళమీదా, స్తంభాలమీదా చెక్కబడి వున్నవి. ఇవన్నీ ప్రాకృతభాషలో ఉన్నాయి. ప్రాకృతమే ఇక్ష్వాకులకాలం నాటికి కూడా రాజభాషగా ఉండింది. దానపత్రం వ్రాసినా, మరే పత్రం వ్రాసినా అన్నీ ప్రాకృతభాషలోనే వ్రాసారు. ఈ శాసనాలన్నీ ఇక్ష్వాకుల కాలంలోని బౌధ్ధ సన్యాసులకు, బౌధ్ధ స్తూపాలకూ చేసిన దానధర్మాలను తెలిపేవి. ఆ కాలంలో స్త్రీలు కూడా బౌధ్ధం స్వీకరించి సన్యాసినులై బౌధ్ధ విహారలలో నివాసముండేవారు. అన్ని విద్యలనూ, కళలనూ నేర్చేవారు.
శాసనాల వలన మనకు ఇంతవరకూ తెలియవచ్చిన ఇక్ష్వాకువంశపు రాజులు ముగ్గురే. వాసిష్ఠీ పుత్ర క్షాంతమూల మహారాజు. ఇతని కుమారుడు మాఢరీపుత్ర వీరపురుషదత్తుడు, ఇతని కుమారుడు ఎహువులక్షాంతిమూలుడు. వాసిష్ఠీపుత్ర, మాఢరీపుత్ర పదాలను బట్టి ఆనాడు స్త్రీలకు ఎంతటి గౌరవం ఉండేదో తెలుస్తుంది. ఈ సంప్రదాయం సాతవాహనుల నుంచీ వచ్చిన ఆచారమే. ఆ సంప్రదాయాన్ని ఇక్ష్వాకులూ కొనసాగించారు.
ఇక్ష్వాకు రాజ్యన్ని తెలుగునేలన స్థాపించిన వాసిష్ఠీపుత్ర క్షాంతమూలుడు చాలా పరాక్రమవంతుడైన రాజు. సాతవాహన రాజైన శ్రీశాతకర్ణిలాగే ఇతడూ ఎన్నో యజ్ఞయాగాలను చేశాడు. వీటిలో ముఖ్యమైనవి వాజపేయ, అశ్వమేధ యాగాలు. అశ్వమేధం చేశాడు గనుక ఇతడు గొప్ప పరాక్రమవంతుడై చుట్ట్లుపక్కల రాజ్యాలనన్నిటినీ జయించి కీర్తి గడించిన రాజు అయ్యాడు. అయితే, ఇతని కాలపు శాసనం ఒక్కటికూడా ఇంతవరకూ దొరకలేదు. ఇతడిని గురించిన సమాచారం కొంతవరకూ ఇతని తనయుడైన వీరపురుషదత్తుని శాసనాలవల్లనే తెలుస్తుంది. ఈ శాసనాలవలన వాసిష్ఠీపుత్ర క్షాంతమూలుడు అప్రతిహత సంకల్పుడని, కుమారస్వామి భక్తుడని, మహా దానధర్మ నిరతుడని, అనేకకోటి హిరణ్యాలు (బంగారు నాణేలు) దానం చేశాడని, లక్షలకొద్దీ గోవులను, హలాల భూమిని దానం చేశాడని తెలుస్తుంది. హలం అంటే నాగలి. ఒక్క నాగలితో సేద్యం చేయడానికి వీలయ్యే భూమిని ఒక హలం అనేవారు. లక్షలకొద్దీ హలాల భూమిని దానమిచ్చాడంటే ఆ మహారాజు ఎంతో భూమిని సేద్యం లోనికి తెచ్చాడన్నమాట. సరసిక, కుసుమలత అనేవారు క్షాంతమూలుని భార్యలు; హమ్మశ్రీనిక, క్షాంతిశ్రీ అనేవారు ఈతని చెల్లెళ్ళు.
మనకు దొరికిన ఇక్ష్వాకు శాసనాలన్నిటిలో చాలాభాగం శ్రీవీరపురుషదత్తుని కాలం నాటివే. ఇతడు దాదాపు ఇరవై సంవత్సరాలు రాజ్యం చేశాడు. ఇతని రాజధాని విజయపురి, కృష్ణానది తీరాన ఉన్న నాగార్జునకొండ ప్రదేశంలోనే పూర్వం విజయపురి ఉండేదని తెలుస్తుంది. ఇక్ష్వాకు రాజుల కాలంలో ఇది ఒక మహానగరం. ఇక్ష్వాకు రాజుల కాలంలో వెలసిన బౌధ్ధస్తూపాలు, విహారాలు, ఇక్కడ ఈ నాగార్జునకొండలోనే ఉన్నాయి. ఇవన్నీ శ్రీ వీరపురుషదత్తుని రాజ్యకాలంలో కట్టినవే. ఈ కాలంలో నాగార్జునకొండకు శ్రీపర్వతమని పేరు.
శ్రీ వీరపురుషదత్తుని కుమారుడు ఎహువుల క్షాంతిమూలుడు. ఇతడు వీరపురుషదత్తుని రాణి వాసిష్ఠీభట్టిదేవికి జన్మించినవాడు. ఇక్ష్వాకు రాజులలో మనకు తెలిసిన కడపటి రాజు ఇతడే. ఇతడు పదకొండు సంవత్సరాలు రాజ్యం చేసినట్లు ఇతని కాలపు శాసనాలవలన తెలుస్తుంది.
ఇక్ష్వాకు వంశపురాజులు మొత్తం మీద యాభై సంవత్సరాలు పరిపాలించినట్లు తెలుస్తుంది. అందువలన వీరి రాజ్యపాలనం క్రీ.శ.నాలుగవ శతాబ్ది చివరి కాలంలో అంతమైందని చప్పవచ్చు. ఏ కారణాల వలన వీరి రాజ్యం అంతమయినదీ మనకు తెలియదు.
ఇక్ష్వాకు రాజుల కాలంలో పూగియ, కులహక, ధనిక తెగలవారు రాజ్యంలో గొప్పగా అధికారాలు వహించడం వల్లనైతేనేమి, రాజకుటుంబంతో సంబంధ బాంధవ్యాలు జరపడంవల్ల నైతేనేమి ప్రముఖులుగా ఉంటూ వచ్చారు. సాతవాహన యుగం రెండవ అర్ధంలో మనదేశంలో ప్రవేశించిన శకులు శైవ, వైష్ణవ, బౌధ్ధమతాలు అవలంబించడమే కాక ఇక్కడ దేశంలో స్థిరపడిపోయి ఇక్కడివారితో వివాహ సంబంధాలను కూడా చేస్తూవచ్చారు. ఇక్ష్వాకు కాలంనాటికి ఈ సంబంధ బాంధవ్యాలు చాల హెచ్చాయి. ఉజ్జయినీ నగరం రాజధానిగా గలిగిన శకుల్ల కన్య అయిన రుద్రధరభట్టారికను ఇక్ష్వాకువంశజుడైన శ్రీ వీరపురుషదత్తుడు పెండ్లి చేసుకున్నాడు. శకరాజ్యాలకూ ఆంధ్రదేశానికీ వర్తకవ్యాపారమూ రాకపోకలు హెచ్చడమే కాక, శకజాతివారి కుటుంబాలు మనదేశానికి వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకోవడం కూదా జరిగింది.
ఇక్ష్వాకు రాజులు ప్రాకృతాన్ని ఆదరిస్తే, శకరాజులు సంస్కృతాన్ని పోషించారు. మనదేశానికి పెరవారయినప్పటికీ వేదభాషయైన సంస్కృతాన్ని, సంస్కృతభాషా పండితులను ఆదరించి వారీ దేశంలో పలుకుబడి సంపాదించుకుని తమ రాజ్యం సుప్రతిష్టం చేసుకున్నారు. ఉజ్జయిని సంస్కృత విద్యలకు ఆలవాలమయింది. జ్యౌతిష్యం మొదలయిన శాస్త్రాలన్ని శకరాజులిచ్చిన ఆదరప్రోత్సాహాలవల్ల బాగా వర్ధిల్లాయి. మనం ఇప్పుడు వాడుతూన్న పంచాంగం మొట్టమొదటగా శకరాజాస్థానమైన ఉజ్జయినిలో గణితమై పరివ్యాప్తమైనదే. తిథి, వార, పక్ష, మాసాదులతో కూడిన ఈ పంచాంగం ఆంధ్రదేశంలో ఇక్ష్వాకు వంశపు రాజూల తరువాత చాలాకాలానికిగాని వాడుకలోనికి రాలేదు. సాతవాహనుల కాలంలోనూ, ఇక్ష్వాకుల కాలంలోనూ సంవత్సరానికి గ్రీష్మం, వర్షము, హేమంతం అని ఒక్కొక ఋతువుకు నాలుగుమాసాల (ఎనిమిది పక్షాల) మూడు ఋతువులే. మన ఇప్పటి చాంద్రమాన వ్యవహారం శకరాజ్యములనుండి వచ్చినట్లు కనబడుతుంది.
ఇక్ష్వాకు రాజులను తలచుకోగానే మనకు జ్ఞాపకం వచ్చేది నాగార్జునకొండ. ఆ కాలంలో ఈ ప్రదేశమంతా ఒక మహా సుందరమైన దివ్య బౌధ్ధారామం. ఇక్ష్వాకు రాజవంశానికి సంబంధించినవారూ ఇతరులూ స్త్రీలనేకులూ శ్రీవీరపురుషదత్తమహారాజు కాలంలోనూ, అతని కుమారుని పరిపాలనా కాలంలోనూ ఎన్నో చైత్యాలు, చైత్యగృహాలు, మండపాలు, విహారాలు కట్టించారు; వాటికి దానాలు అనేకం చేశారు. కులహవిహారము, సింహళవిహారము, దేవీ విహారము అని ఇక్కడ ఎన్నో విహారాలు ఉండేవి. ఆ కాలంలో ఇక్కడకు కాశ్మీర, గాంధార, చీన, చిలాత, అపరాంత, వంగ, వనవాసి, యవన, ద్రమిళాది దేశాలనుంచీ, సింహళాది ద్వీపాల నుంచీ బౌధ్ధులు యాత్రార్ధం వచ్చేవారు. నాగార్జునాచార్యులవారు ఈ కొందమీద నివాసముండడం వలన బహుశా ఈ కొండకు ఆ పేరు వచ్చివుంటుంది. నాగార్జునకొండలోని ప్రధాన స్తూపానికి మహాచైత్యమని పేరు.  బుధ్ధభగవానుని ధాతువును ఇందులో వుంచి దానిని క్షాంతిమూలుని సోదరి క్షాంతిశ్రీ తన మేనల్లుడైన శ్రీ వీరపురుషదత్తుని ఆరవ రాజ్యపాలన సంవత్సరంలో కట్టించింది. ఈమె బంధువులైన స్త్రీలు అనేకులు ఈ చైత్యానికి స్తంభాలెత్తించి, ఇతర అలంకారాలు కూర్చి అందగింపజేశారు. క్షాంతిశ్రీ బాటలోనే నడిచి ఇక్కడ చైత్యగృహాలు, మండపాలు కట్టించిన మరొక స్త్రీ బోధిశ్రీ. చిత్రమేమంటే, ఇక్కడ బౌధ్ధస్తూపాలు, చైత్యాలు, మండపాలు కట్టించినవారు, వాటికి అవసరమైన దానాలు చేసినవారు అందరూ స్త్రీలే. ఇక్ష్వాకువంశ రాజులు, రాజబంధువులు పురుషులు వేదమతావలంబకులు, స్త్రీలు బౌధ్ధమతావలంబకులు. ఇలా ఒకే కుటుంబములోనే కొందరిది ఒక మతం, మరికొందరిది ఇంకొక మతం అయినా దానివలన కుటుంబ సౌమ్యజీవనానికి, ఐకమత్యానికి భంగం వుండేది కాదు.
హిందూదేశంలో అంతటిలోనూ అత్యుత్తమమైనదని పేరుపడింది ఆనాటి మన బౌధ్ధాంధ్ర శిల్పకళ. చెక్కడానికి తీసుకున్న వస్తువు బుధ్ధునికి సంబంధించినది అయినా, ఆనాటి శిల్పులు అప్పటి శిల్పంలో ఆనాటి మన జీవనవిధానానికి సంబంధించిన చాలా సంగతులను అందులో మేళవించి చూపించారు. ఉడుపులు, ఆభరణాలు, ఎక్కి ప్రయాణించిన బండ్లు అన్నీ ఆ కాలములో మన పూర్వులు ఉపయోగించిన వాటినే చెక్కి చూపించారు. స్త్రీలు పురుషులు తమ కేశపాశములను దిద్దుకుని అమర్చుకున్న విధానాలు, అందుకై వారు వాడిన సామగ్రి, ఆనాటి రాజప్రాసాదాల నమూనాలు, సామాన్య గృహాలు ఇత్యాదిగా అన్నీ ఈ శిల్పాలలో ప్రదర్శించబడి కనిపిస్తాయి. ఇలా నాగార్జునకొండ అంటే ఇక్ష్వాకుల కాలంనాటి  ప్రాచీనాంధ్ర సంస్కృతికి ఒక కళానిక్షేపంగా మారింది.

కాకతీయులు

కాకతీయులు
- శ్రీ పాములపర్తి సదాశివరావు
           ఆంధ్రదేశ చరిత్రలో కాకతీయ సామ్రాజ్యం వర్ధిల్లిన కాలము ఒక మహోజ్జ్వల ఘట్టము. కాకతిరాజులు పెక్కు విషమ పరిస్థితులకు తట్టుకొని తెలుగుదేశము నేల నాలుగు చెరగులు వశపరచుకొని విశాల సామ్రాజ్యమును స్థాపించిన మహనీయులు. తెలుగు ప్రజానీకమునకు ఒక వైశిష్ఠ్యమును, వ్యక్తిత్వమును సమకూర్చిన మహోదాత్త చరితులు. ఉత్తరదేశపు గట్లు త్రెంపుకొని వెల్లువవలె వచ్చు మహమ్మదీయుల దండయాత్రలను నిలువరించిన వీరలోక మూర్ధన్యులు కాకతీయ రాజులు.
కాకర్త్యగుండన
           పూర్వము కాకతులను ఒకతెగవారు ఆంధ్రదేశమున పెక్కుచోట్ల నివసించి, కాకతియను ఒక దేవతను ఆరాధించెడి వారనియు, అందువలననే వారికా పేరు వచ్చినదనియు తెలియుచున్నది. గుండయ్య యనునతడు రాష్ట్రకూట గ్రామాధికారిగా యుండెననియు, అతని పౌత్రుడు కాకర్త్యగుండన వేంగీ చాళుక్యరాజులకు సామంతుడై ఉన్నతాధికారములను పొందెననియు, తరువాతి పురుషాంతరమునకు చెందిన మొదటి బేతరాజు చిన్న రాజ్యమును నిర్మించుకొని దానికి పాలకుడై కాకతీయ రాజవంశ స్థాపకుడయ్యెననియు తెలియుచున్నది.
కాకతి బేతరాజు
           మొదటి బేతరాజు చోళరాజులను గెల్చినట్లును కాకతిపురమును పాలించినట్లును అనేకాధారములున్నవి. కాని, ఈ చోళరాజులు ఏ ప్రాంతమువారో వివరములు లభించలేదు. కాకతిపురము ఇప్పటి హనుమకొండయేయని చెప్పవచ్చును. ఇతని కాలము క్రీ.శ.1020 నుండి 1050 వరకని చారిత్రకుల అభిప్రాయము. వేంగి చాళుక్య రాజగు రెండవ అమ్మరాజు కాలమున కాకతీయుల వలెనే దుర్జయ వంశీయులగు విరియాలవారు నేటి వరంగల్లు జిల్లాలోని గూడూరు ప్రాంతమును సామంతులుగ పరిపాలించుచుండిరి, రెండవ అమ్మరాజు మరణానంతరము వేంగిలో పెద్ద కల్లోలము సంభవించెను. ఈ కల్లోలములో కాకతి విరియాల వంశీయులు క్లిష్టపరిస్థితులకు లోనైరి. ఈ సమయమున విరియాల ఎర్రన కాకతిబేతరాజుకు గల శత్రుసమూహమును నిర్మూలించి, అతనిని కొరవి దేశమునకు అధిపతిని కావించెను. ఈ ఎర్రన భార్య కామసానికూడ బేతరాజుకు సాయపడి కాకతివంశమును సుప్రతిష్ఠితము కావించెను.
కాకతి ప్రోలరాజు
           మొదటి ప్రోలరాజు కాలము క్రీ.శ.1050 నుండి 1070 వరకు. ఈ రాజుకాలమున దాక్షిణాత్య చోళులును, పశ్చిమ చాళుక్యులును నిరంతరము పోరాడుచుండిరి. చోళులు వేంగీ చాళుక్యులతో చుట్టరికము కలుపుకొని వేంగిలో పలుకుబడిని సంపాదించిరి. దీనికి ప్రతీకారముగ చాళుక్యులు వేంగిని కబళించు నుద్దేశముతో తూర్పు దిక్కుననుండి విజృంభించి వరంగల్లువరకును చొచ్చుకొనివచ్చిరి. కాకతిరాజ్యము ఈ రెండు రాజ్యములకు నడుమనుండి ప్రమాదమునకు గురియయ్యెను, అప్పుడు ప్రోలరాజు ప్రక్క నుండిన పురుకూ దేశమును జయించి, ఇతర మాండలిక రాజులతో పోరాడి తన రాజ్యమును విస్తరింపజేసెను. ఆ సమయమున నితడు చాళుక్య రాజగు త్రైలోక్యమల్లునికి సామంతుడై, తన రాజ్యమునకు హాని కలుగకుండ జూచుకొనవలసి వచ్చెను. ఆ సందర్భముననే యితడు భద్రంగపురముపై దండెత్తి ఆ రాజవంశీయులను విధేయులను కావించుకొనెను. క్రీ.శ.1052లో చోళులకును, చాళుక్యులకును 'కొప్పం' అనుచోట పెద్ద సమరము జరిగెను. అందు చోళరాజగు రాజాధిరాజు మరణింప, అతని సైన్యములు పారిపోయెను. కాకతి ప్రోలరాజును, అతని సేనానియగు బమ్మనయు ఆ పరిపోవు సైన్యములను కంచివరకు తరిమికొట్టి, కంచిని పట్టుకొనిరి. క్రీ.శ.1061లో చక్రకూట పాలకుడైన ధారావర్షుడు వేంగీ చాళుక్య రాజ్యముపై దండెత్తెను. వేంగీచాళుక్య రాజరాజును, అతని కుమారుడును ధారావర్షుని మదమణచుటకు చక్రకూటముపై దండెత్తిరి. ఈ యలజడులలో ప్రోలరాజు తన రాజ్యమునకు ధారావర్షునివల్ల కీడు కలుగకుండ కాపాడుకొననెంచి, తన ప్రభువగు త్రైలోక్యమల్లుని యనుజ్ఞను పొంది చక్రకూటముపై దండెత్తి ధారావర్షుని ఓడిరచెను.
రెండవ బేతరాజు
           రెండవ బేతరాజు కాలమున చాళుక్యరాజగు భువనైకమల్ల సోమ్వేరునికిని, అతని తమ్ముడగు విక్రమాదిత్యునికిని జరిగిన పోరాటములందు రెండవ బేతరాజు స్వతంత్రుడగుటకు ప్రయత్నించెను. ఆ సమయమున విక్రమాదిత్యుడు త్రిభువనమల్ల బిరుదమును వహించి చాళుక్య చక్రవర్తి అయ్యెను. బేతరాజు మంత్రియగు వైజదండాధినాథుడు చాళుక్య చక్రవర్తిని ప్రసన్నుని కావించుకొని, తన ప్రభువునకు ఎట్టిహానియు కలుగకుండుగట్లుగా చేసి, ఆ చక్రవర్తిచే అతనికి సబ్బి సౌహీరాదులైన నూరుమండలములను ఇప్పించెను. నాటి నుండి బేతరాజు విక్రమాదిత్యునకు వ్విసనీయుడుగా నుండి అనేక బిరుదములను వహించి 1079 నుండి 1115 వరకు పరిపాలన సాగించెను.
రెండవ ప్రోలరాజు
           పిదప రెండవ ప్రోలరాజు 1115 నుండి 1158 వరకు రాజ్యమును పాలించెను. ఈ మహారాజు మహాశూరుడు. విక్రమాదిత్యుని మరణానంతరము తన రాజ్యమును విస్తృత మొనర్చుకొనుటకు ఈతనికి మంచి యవకాశము కలిగెను. అప్పుడు కాకతిరాజ్యమును అంటియుండిన మహబూబ్‌నగర్‌ (పాలమూరు) నలగొండ జిల్లాలను తైలపదేవుడను చాళుక్యరాజన్యుడు పాలించుచుండెను. అతనికి ప్రోలరాజుపై కన్నెఱ్ఱగానుండెను. అది కనిపెట్టి రెండవ ప్రోలరాజు అతనిపై దండెత్తి, వెళ్ళి, అతనిని ఓడిరచి, బంధించియు విడిచిపెట్టి దాక్షిణ్యమును ప్రదర్శించెను. ఆ విజయమున ద్విగుణీకృతోత్సాహముతో ప్రోలరాజు కొండపల్లి ప్రాంతమునేలెడి గోవిందరసును, మంత్రకూట పాలకుడగు గుండరాజును జయించెను. రెండవ ప్రోలుని విజృంభణము నరికట్టుటకై వేములవాడ పాలకుడగు జగద్దేవుడు హనుమకొండపై దండెత్తిరాగా ప్రోలుడాతనిని ఓడిరచి తరిమికొట్టెను. ఈ విధముగా ఆనాడు చితికిపోయిన చాళుక్యరాజ్య శకలములలో ఈ వీరుడు అత్యధికభాగము కైవసము చేసుకొని ఏకచ్ఛత్రముగా పరిపాలన సాగించెను. కాకతీయ సామ్రాజ్యమును సాటిలేనిదానినిగా చేసి పెంపొందించెను. ఇట్లు నాల్గుతరములలో, సర్వస్వతంత్రరూపమున కాకతీయ సామ్రాజ్యము దక్షిణాపథమున సుస్థిరత్వము పొందినది. రెండవ ప్రోలరాజు కాలముననే హనుమకొండకోటను మార్చివేసి, అచ్చటికి అయిదుమైళ్ళ దూరమున బ్రహ్మాండముగా ఓరుగల్లు కోటను నిర్మించుటకు సన్నాహములు జరిగెను. నాటి నుండి కాకతీయ సామ్రాజ్య ప్రాబల్యము హెచ్చసాగినది.
రుద్రదేవ మహారాజు
           రెండవ ప్రోలరాజు పిదప రుద్రదేవ మహారాజు పరిపాలన మారంభమైనది, ఇతడు ఓరుగల్లు కోటను శత్రుదుర్భేద్యముగా నిర్మింపజేసెను. పొలాస ప్రాంతమున మేడరాజును జయించి తన రాజ్యమును మరింత విస్తృతి నొందించెను. వేయిస్తంభాలగుడిని నిర్మించినవాడీ రుద్రదేవమహారాజే. ఇతడనేక శైవదేవాలయ నిర్మాణములను ప్రోత్సహించెను. ఇతని పరిపాలన కాలము క్రీ.శ. 1158 నుండి 1195 వరకు. ఇతని యాస్థానమున అచితేంద్రవరుడను నొక సంస్కృతకవి ఉండెడివాడు. ఈ కవివతంసుడే వేయిస్తంభాల గుడియందలి శాసనమును చక్కని సంస్కృత శ్లోకములతో రచించెను. రుద్రదేవుని యనంతరము అతని తమ్ముడు మహదేవ రాజు 1195 నుండి 1199 వరకు రాజ్యపరిపాలన చేసెను.
కాకతి గణపతిదేవ చక్రవర్తి
           అటుపై 1199 నుండి 1261 వరకు మహదేవ రాజు కుమారుడైన గణపతి దేవుడు కాకతీయ సామ్రాజ్య పాలన భారమును వహించెను. గణపతి దేవుడు గొప్పవీరుడు. పరిపాలనా దక్షుడు. ఇతని కాలమున మహాతటాకముల నిర్మాణము జరిగెను. ప్రఖ్యాతమైన పాఖాల, లక్నవరం, ఘనపురం తటాకములు గణపతి దేవుడు నిర్మింపజేసినవే. తటాకపుతూములవద్ద రామప్పగుడి, ఘనపుర దేవాలయముల వంటి దివ్యకళా నిర్మాణములను రూపొందించు నాచారమును కూడ గణపతి దేవుడే ప్రవేశపెట్టి యుండెను. గణపతి దేవుడు తన రాజ్యమును బహుముఖముల విస్తరింప జేసి దానిని ఒక మహాసామ్రాజ్యముగా మార్చెను. మోటుపల్లి సముద్రపు రేవును విస్తరింపజేసెను. కళింగ, పాండ్య, శ్రీశైల, ఇందూరు ప్రాంతములలో కాకతీయులు జయ పతాకలను ఎగురవేసిరి. నెల్లూరి మండలము నుండి తిక్కన్న సోమయాజిని ఓరుగల్లునకు ఆహ్వానించి గణపతిదేవుడు ఘనమైన సత్కారము కావించెను. పలువురు కవి పండితులను, శిల్పులను, నటీనటగాయకులను, ధర్మశాస్త్రజ్ఞులను, సేనానాయకులను సన్మానించి, వారి ఆదరాభిమానములకును, విశ్వాసమునకు పాత్రుడయ్యెను. కాకతీయ రాజ్య చరిత్రలో గణపతి దేవుని కాలము స్వర్ణయుగ మనవచ్చును. గణపతిదేవుడు అనేక దేశములను జయించి, చక్రవర్తియై యావదాంధ్ర దేశమును ఏకచ్ఛత్రాధిపత్యమున పాలించి చిరయశస్సు నార్జించెను.
రుద్రమదేవి
           గణపతిదేవుని యనంతరము రుద్రమదేవి క్రీ.శ.1261 నుండి 1296 వరకు పరిపాలించెను. ఈమె గణపతిదేవుని కూతురు. భర్త వీరభద్ర రాజు. నిడుదవోలు ప్రాంతమును పాలించు రాజు. రుద్రమదేవి రుద్రమదేవుడను పేరుతో పురుష వేషమును ధరించి పరిపాలించుచుండెడిది. ఈమె ఆయినవోలులో మైలారదేవుని గుడికి ప్రాకారతోరణాదులను నిర్మింపజేసెను. ఈమె స్వయంభూస్వామి భక్తురాలు. ఈమె తన కుమార్తెయగు రుయ్యాంబికను ఇందులూరి అన్నయ్య మంత్రికిచ్చి వివాహమొనర్చెను. రుద్రమదేవి పౌరుషోచితగా పెక్కు తిరుగుబాట్లను అణచివేసెను. ఉత్తరదిశ నుండి యాదవ మహారాజు దండెత్తివచ్చి ఓరుగంటిని ముట్టడిరచినపుడీమె మహాపరాక్రమముతో ఎదుర్కొని అతని నోడిరచి గోదావరి వరకు తరిమివైచెను. సామ్రాజ్యమున శాంతిభద్రతలను సుస్థిరము కావించెను వర్తక వాణిజ్యములను పెంపొందించెను.
ప్రతాపరుద్రుడు
           అనంతరము ప్రతాపరుద్రుడు (1296-1326) కాకతీయ రాజ్యమును పరిపాలించెను. ఇతని కాలమున కాకతి సామ్రాజ్యము అస్థిరతకు గురియైనది. దేవగిరి యాదవరాజులు మహమ్మదీయ దండయాత్రలను పురికొల్పిరి. ప్రతాపరుద్రుని పరిపాలనము ఎంత ప్రశంసనీయముగా నున్నను, మాటిమాటికి దండయాత్రలకు దేశములోనగుచు వచ్చెను. తుదకు గియాసుద్దీన్‌ తుగ్లక్‌ కుమారుడైన ఉలఘ్ ఖాన్‌ ఓరుగల్లు కోటను ముట్టడిరచి విధ్వంసము చేసెను. అంతటితో కాకతీయ సామ్రాజ్యము అంతరించెను.
           కాకతీయ సామ్రాజ్యము అంతరించినను నాటి యుగవైభవమును చాటుటకు తెలుగు భాషలో శైవ వాఙ్మయము గణనీయమై వెలసినది. పండితారాధ్యుని శివతత్త్వసారము, పాల్కురికి సోమనాథుని బసవపురాణ పండితారాధ్యచరిత్రాదులు, నన్నెచోడుని కుమార సంభవము, విద్యానాథుని ప్రతాపరుద్రీయము నాటి సాంఘిక పరిస్థితులకు దర్పణము పట్టుచున్న ఉత్తమ గ్రంథములు. మారన రచించిన మార్కండేయ పురాణము ఈ యుగమునందలిదే. విజయనగర రాజకుమారుడైన కుమారకంపరాయల భార్య గంగాదేవి బాలభారతకర్తయగు అగస్త్యుని తన గురువుగా నుతించియుండెను.
           కాకతీయ యుగమున తెలుగుదేశమంతయు ఏకచ్ఛత్రాధి పత్యముక్రిందికి వచ్చెను. ఈ కాలమున తెలుగుదేశములోని ప్రధానమతము పాశుపతశైవము. గోళకీ మఠమునకు చెందిన పాశుపత శివాచార్యులు గుంటూరు, కర్నూలు, కడప మండలములందును మరియు ననేక స్థలములందును శైవపీఠములను స్థాపించియుండిరి. మందడములోని గోళకీమఠములో ప్రసూత్యారోగ్యశాలకూడ నుండెడిదని శాసనములవల్ల తెలియుచున్నది.
           కాకతీయులు శిల్పమును, దేవాలయ నిర్మాణ వాస్తువును పోషించిరి. నాట్యకళకూడ ఆకాలమున వర్ధిల్లినది. గణపతిదేవుని సేనానియగు జాయపుడు సంగీతనాట్యములను గూర్చి రెండు గ్రంథములను రచించెను వానిలో నృత్తరత్నావళిమాత్రమే లభించినది. శ్రీశైలమున అరువది నాట్యకూటము లుండెడివని ప్రసిద్ధి. ఆకాలమున సంస్కృతాంధ్రభాషలు వర్ధిల్లినవి. ఉభయభాషలయందును శాసనములు రచించబడినవి. మహాతటాకముల నిర్మాణము వలన పాడిపంటలతో తులదూగుచు దేశము సుభిక్షమై విలసిల్లినది. గణపతిదేవ తిక్కన మహాకవుల కృషివలన తెలుగు ప్రజలలో సమైక్యభావమునకు ఆ కాలముననే స్థిరమైన పునాదులు పడినవి.
ఓరుంగంటి పురంబు సౌధములపై నొప్పారెడిన్‌ జూచితే
యీ రెండల్‌ మణిహేమ కుంభములతో ఏకాంతముల్‌ సేయుచున్‌
స్వారాజ్య ప్రమాదాఘన స్తనభర స్థానంబులంబాసి, కా
శ్మీరక్షోదము, ప్రాణవల్లభదృఢా శ్లేషంబులన్‌ రాలెనాన్‌.
- వినుకొండ వల్లభరాయఁడు

కాకతీయులు - రాజ్యపాలన

కాకతీయులు - రాజ్యపాలన

mirrored 

కె.రవికుమార్‌  -   Mon, 4 Jan 2010, IST
  • ఆంధ్రుల చరిత్ర

శాతవాహనుల తర్వాత తెలుగు దేశాన్నంతా ఒక రాజకీయ ఛత్రం క్రిందకు తెచ్చి దేశ సమగ్రత, సమైక్యతను చేకూర్చిన తెలుగుపాలకులు కాకతీయులు. ఆంధ్రదేశ చరిత్రలో కాకతీయులకు ఒక ప్రత్యేక, విశిష్టమైన స్థానం ఉంది. వీరు విశాల సామ్రాజ్యాన్ని పాలించడమే కాక పటిష్ట పరిపాలనావ్యవస్థను ప్రవేశపెట్టి వ్యవసాయానికి నీటి వనరులు కల్పించి,గ్రామీణ జనజీవితాలలో కళా సాహిత్యాలను సజీవపరిచి, విశిష్టమైన దేవాలయ నిర్మాణాలను కావించి, తెలుగువారి రాజకీయ, సాంస్కృతిక వారసత్వ జీవనానికి తోడ్పడినారు.
కాకతీయుల పుట్టుపూర్వోత్తరాలు ఆవిర్భావం
కాకతీయుల పుట్టుపూర్వతలలో కొంత సందిగ్ధ పరిస్థితి నెలకొన్నది. కాకతి అనేది ఒక దేవత పేరా లేక ప్రదేశమా అనేది ఒక ప్రశ్న. రెండవ అంశము వీరి నివాస స్థలం. చరిత్రకందిన ఆధారాలలో వీరి నివాసం కాకతీపురం. అయితే కాకతీపురం ఎక్కడ ఉంది. మరో సమస్య. కాకతీయులు క్షత్రియులా లేక శూద్రులా. చరిత్రకారులే ఈ ప్రధాన అంశంపై ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. దీనికి కారణం విశ్వనాధుడు రచించిన ప్రతాపరుద్ర యశోభూషిణి, వినుకొండ వల్లభాచార్యుడు రచించిన క్రీడాభిరామం వంటి గ్రంథాలు. కాకతి అనే దేవతను ఆరాధించడం వల్ల వీరికి కాకతీయులు అని పేరు వచ్చింది అని తెలియజేశారు కాని కాకతీయుల శాసనాలలో స్వయం భూదేవ పాదక పూజ భక్తులుగా పేర్కొన్నారు. బయ్యారం చెరువు శాసనాన్ని బట్టి వంశ మూలపురుషుడు వెన్నుడు కాకతిపురం అనే ప్రదేశంలో పాలన సాగించడం వల్ల వీరికి కాకతీయులు అనే పేరు వచ్చిందని తెలియజేస్తుంది. ఈ శాసనం మరో అంశాన్ని స్పష్టపరుస్తుంది. వీరు సూర్య, చంద్ర వంశరాజులుగా పేర్కొన్నారు. కాని కాకతి అనే పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం గాని పూర్వం గాని ఏ పట్నంకాని, పల్లెగాని లేదు. అంతేకాక వీరు రాష్ట్రకూట సామంతులుగా, శూద్ర వంశస్థులుగా కొన్ని ఆధారాలు లభించాయి. తత్ఫలితంగా వీరి పుట్టుపూర్వోత్తరాలలో కొంత సందిగ్ధత నెలకొన్నది.
కాకతీయుల పాలనకు ఆధారాలు
కాకతీయులను గూర్చిన మొదటి ప్రస్తావన తూర్పు చాళుక్యరాజు దానార్ణవుని మాగల్లు శాసనం గణపతి దేవుని చెల్లెలు మైలాంబ ఖాజీపేట శాసనం, బయ్యారం చెరువు శాసనం
కాకతీయుల రుద్రదేవుని కాలంలో రచించిన హనుమకొండ శాసనం పాల్కురికి సోమన పండితారాధ్య చరిత్ర
జయప సేనాని గీత రత్నావళి , వ్యాస రత్నావళి, నృత్య రత్నావళి మొదలైనవి
కాకతీయుల రాజ్యపాలన (1030 1323)
కాకర్త్య గుండ్యన (కాకతీయ మూలపురుషుడు మొదటి బేతరాజు(కాకతీ వల్లభుడు) మొదటి ప్రోలరాజు (జగతికేసరి అనే చెరువు తవ్వించాడు) 2వ బేతరాజు)మహామండలేశ్వర, త్రిభువన మల్ల, విక్రమ చక్ర అనే బిరుదులు ఉన్నాయి. అతని కాలంలో హనుమకొండ రాజధాని అయింది.
దుర్గరాజు లేదా దుర్గ నృపతి(చలమర్తిగండ అనే బి రుదు ఉంది). రామేశ్వర దీక్షితునికి అగ్రహారం ఇచ్చాడు) రెండవ ప్రోలరాజు (కాకతీయులు స్వతంత్రులు అయా రు) రుద్రదేవుడు. (ఇతనిని మొదటి ప్రతాపరుద్రుడు అని కూడా అంటారు. హనుమకొండ శాసనం వేయించాడు. ఓరుగల్లు దుర్గం నిర్మాణం చేపట్టి దానిని రాజధానిగా చేసుకున్నాడు. హనుమకొండలో వేయిస్తంభాల దేవాలయాన్ని ఇతని కాలంలో నిర్మించారు.)
గణపతిదేవుడు (మహదేవరాజు కుమారుడు. మనుమసిద్ధి ఆస్థానకవి అయిన తిక్కన గణపతిదేవుని ఆస్థానానికి రాయబారిగా వెళ్లి మహాభారతాన్ని తెలుగులో అనువదించాడు.
రుద్రమదేవి(ఆంధ్రదేశంలో మొట్టమొదటి స్వతంత్ర పాలకురాలు. మార్క్‌పోలో అనే వెనిస్‌ యాత్రికుడు ఆంధ్రప్రాంతంలో పర్యటించాడు.) ప్రతాపరుద్రుడు (రెండవ ప్రతాపరుద్రుడు అని కూడా అంటారు) కాకతీయుల చివరి పాలకుడు)
కాకతీయులు మొదట రాష్ట్రకూటుల సైనికాధికారులుగాను, సామంతులుగాను ఉన్నారు. రెండవ కృష్ణుని దగ్గర సైన్యాధికారి (సేనాని)అయిన కాకర్త్యి గుండ్యన తూర్పుచాళుక్యులతో యుద్ధం చేస్తూ మరణించాడు. గుండ్యన రాజభక్తికి గుర్తింపుగా గుండ్యన కుమారుడు ఎర్రయను కృష్ణుడు కురవి ప్రాంతానికి సామంతునిగా నియమించాడు. ఎర్రయ తరువాత అతని కుమారుడు బేతియ, తరువాత కాకర్త్య గుండ్యన పదవిలోకి వచ్చా రు. ఈసమయంలో వేంగిలో సింహాసనంకోసం దాయాదుల మధ్య ఘర్షణ ఏర్పడింది. రాష్ట్రకూట మాజీ కృష్ణుని సాయంతో దానార్ణవుడు తన తమ్ముడైన రెండవ అమ్మరాజును తొలగించి రాజ్యం కైవసం చేసుకున్నాడు. ఈ యుద్ధంలో కాకర్త్య గుండ్యన దానార్ణవునికు తోడ్పడినందుకు దానార్ణవుడు నతవాడి ప్రాంతాన్ని గుండ్యనకు ఇచ్చాడు. మూడవ కృష్ణుని మరణంతో రాష్ట్రకూటులపై పశ్చిమ చాళుక్యులు ఆధిపత్యం చేయగా. వేంగిలో జటాచోడభీముడు దానార్ణవుని హత్య చేసి రాజకీయ అలజడి సృష్టించాడు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని గుండ్యన స్వాతంత్య్రం ప్రకటించుకునాడు. ఈ చర్యతో కల్యాణి పాలకులు గుండ్యనను పారద్రోలడానికి విరియాల ఎర్రనను పంపారు. ఈ దాడిలో గుండ్యన మరణించాడు. ఈ సంఘటనతో కాకతీయుల వంశం కనుమరుగు కావలసింది. కాని విరియాల ఎర్రన భార్య కామనపానికి గుండ్యన చిన్న కుమారుడు బేతనిపై ఇష్టం ఏర్పడి, అతడికి పశ్చిమ చాళుక్యుల నుండి అనుమకొండ ఇప్పించడానికి తన భర్త ద్వారా పశ్చిమ పాలకులతో సంధి చేసింది. ఈ సంఘటనతో కాకతీయుల వంశానికి పునర్జన్మ లభించింది.(ఈ విషయం గూడూరు శాసనం తెలియచేస్తుంది)
మొదటి బేతరాజు లేదా బేతని: ఇతని శాసనం
కరీంనగర్‌ జిల్లాలోని శనిగరంలో ఉంది. ఇతడు 30 సంవత్సరాలు అనుమకొండ ప్రాంతాన్ని పాలించాడు. శనిగరంలోని యుద్ధ మల్ల ఆలయాన్ని జీర్ణోద్ధరణ కావించి కానుకలు ఇచ్చాడు.
మొదటి ప్రోలరాజు
ఇతని చరిత్రకు శనిగరం శాసనం, కాజీపేట దుర్గాశాసనం ఆధారాలు. ఇతడు మొదటి బేతరాజు కుమారుడు.
ఇతడు పశ్చిమ చక్రవర్తి సోమేశ్వరునితో నమ్మకమైన స్నేహాన్ని చేసి అతనికి అనేక సేవలు చేసి, ప్రీతిపాత్రుడై, అనుమకొండ లిఖితపూర్వకంగా వ్రాయించుకున్నాడు. అంతేకాక పశ్చిమ చాళుక్యుల రాజచిహ్నం వరాహాన్ని ఉపయోగించుకోడానికి అనుమతి పొందాడు. ప్రజల సంక్షేమంకోసం జగత్‌కేసరి తటాకాన్ని తవ్వించి నీటిపారుదల సౌకర్యాలు ఏర్పాటు చేశాడు. తత్‌ఫలితంగా అరిగడకేసరి అనే బిరుదును సార్ధకం చేసుకున్నాడు.
రెండవ బేతరాజు ప్రోలరాజు కుమారుడు 2వ బేతరాజుకు విక్రమచక్ర అనే బిరుదు ఉంది. ఇతడు సబ్సి మండలం కురవి మండలాలను కలుపుకుని అనుమకొండ రాజధానిగా చేసుకుని కాకతీయ రాజ్యం విస్తరింపచేశాడు. ఈ విషయంలో బేతరాజు కు వైజ్య అనే దండనాథుడు తన వంతు కృషిని అందించాడు.
దుర్గన నృపతి లేదా దుర్గరాజు రెండవ బేతరాజు కుమారుడు దుర్గరాజు. ఇతడు 8 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. ఇతనికి త్రిభువన మల్ల చలమర్తి గండ అనే బి రుదులు ఉన్నాయి. ఇతనిని గురించి కాజీపేట శాసనం తెలియజేస్తుంది. ఇతడు రామేశ్వర దీక్షితునికి అగ్రహారం దానం చేశాడు.
రెండవ ప్రోలరాజు దుర్గరాజు మరణించిన తరువాత అనతి తమ్మడు రెండవ ప్రోలరాజు సింహాసనం అధిష్టించాడు. ఇతడు అనేక యుద్ధాలు చేసి చాళుక్యుల సామంతులను ఓడించి, తన అధికారం సుస్థిరపర్చుకుని శ్రీశైలంలో మల్లికార్డుని దర్శించి కృష్ణా, గుంటూరు మండలాలను జయించాలని ఆ ప్రాంతంపై దండెత్తాడు. అయితే ఆ ప్రాంత నాయకులు బోధరాజు నాయకుడుగా చేసుకుని ప్రోలరాజును ఎదుర్కోవడం జరిగింది. ఈ దాడిలో ప్రోలరాజు మరణించినట్టు ద్రాక్షారామం శాసనం వల్ల తెలుస్తున్నది.
రుద్రదేవుడు: ప్రోలరాజు మరణానంతరం ఇతని పెద్ద కుమారుడు రుద్రదేవుడు రాజ్యానికి వచ్చాడు. ఇతనికి మరోపేరు మొదటి ప్రతాపరుద్రుడు. ఇతని కాలంలోనే ఆంధ్రదేశం ఏకచక్రాధిపత్యం క్రిందకి తీసుకువచ్చాడు. రుద్రదేవుని విజయాలకు అతని మంత్రి గంగాధరుడు తోడ్పడ్డాడు. రుద్రదేవుని విజయాలతో ఆంధ్రదేశంలో మొట్టమొదటిసారిగా స్వతంత్ర రాజ్యం ఏర్పాటు అయింది. ఇతని కాలంలో కాకతీయుల రాజ్యవిస్తరణ తూర్పుతీరంలో తీరరేఖనుండి పశ్చిమాన కల్యాణి వర కు, ఉత్తరాన ఒరిస్సా నుండి దక్షిణాన శ్రీశైలం త్రిపురాంతకం వరకు విస్తరించింది. రుద్రదేవుడు పానగల్లులో రుద్రసముద్రమనే తటాకాన్ని తవ్వించాడు. 1195 సంవత్సరంలో యాదవుల రాజు జైతుగి కాకతీయ రాజ్యాన్ని ముట్టడించాడు. ఈ సమయంలో జైతుగి చేతిలో రుద్రదేవుడు మరణించాడు. ఈ విషయాన్ని హేమాద్రి రచించిన చతుర్వర్గ చింతామణి స్పష్టపరుస్తుంది.

కాకతీయ సామ్రాజ్య పతనానికి ప్రధాన కారణం

కాకతీయ సామ్రాజ్య పతనానికి ప్రధాన కారణం

* కోటను ముంచిన కులపోరు
* రెడ్డి-వెలమల ఆధిపత్యపోరు
* రెడ్డి సామంత రాజులు యుద్ధానికి దూరం

               కులాధిపత్య పోరు! నేటి రాజకీయాల్లో సర్వసాధారణమైన ఈ జాడ్యమే.. అలనాడు కాకతీయ సామ్రాజ్య పతనానికీ కారణమైందన్న సంగతి చాలా మందికి తెలియదు. స్వామిద్రోహం, నయవంచన.. కలగలిసి రెండు వందల సంవత్సరాల చరిత్ర పరిసమాప్తికి దారితీశాయన్న సంగతీ తెలియదు. గణపతి దేవుడి పాలనలో తమకు లభించిన ప్రాధాన్యం.. రుద్రమదేవి, ప్రతాపరుద్రుడి కాలంలో దక్కకపోవడంపైరెడ్డి కులానికి చెందిన సామంత రాజులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. 
                తమకు ప్రాధాన్యం లేకపోవడమే కాక.. సైన్యంలో పద్మనాయకుల (వెలమల)కే ప్రాధాన్యం ఉండడాన్ని వారు జీర్ణించుకోలేక పోయారు. 1323లో ఢిల్లీ సుల్తాన్ సేనలు ఓరుగల్లుపై దండెత్తి వచ్చినప్పుడు రెడ్డి సామంత రాజులు ఈ కారణంతోనే సహాయ నిరాకరణ చేశారు. దీనికితోడు.. కాకతీయ సేనలను న్యాయబద్ధంగా ఎదిరించడం అసాధ్యమని తెలుసుకున్న మహ్మద్ బిన్ తుగ్లక్ రెడ్లు, వెలమల నడుమ వైరాన్ని పావుగా వాడుకున్నాడు. కాకతీయ సైన్యంలోని తేరాల బుచ్చారెడ్డి అనే కమాండర్‌కు 18 లక్షల బంగారు నాణేలు ఇస్తానని ఆశ చూపాడు. అందులో సగం ముందే ఇచ్చాడు. 
                     ఆ సొమ్ము తీసుకున్న బుచ్చారెడ్డి అతని మిత్ర సామంతులు.. సుల్తాన్‌తో యుద్ధంలో తామే ముందుండి పోరాడతామని ప్రతాపరుద్రుణ్ని నమ్మించారు. వారిని నమ్మిన ప్రతాపరుద్రుడు యుద్ధరంగాన ఘోరంగా మోసపోయాడు. పోరు కీలక దశలో ఉన్నప్పుడు.. బుచ్చారెడ్డి తన సైన్యాన్ని యుద్ధరంగానికి దూరంగా తరలించాడు. మరికొందరు రెడ్డి సామంతరాజులు కూడా బుచ్చారెడ్డిని అనుసరించారు. బొబ్బారెడ్డి అనే సామంత రాజు ప్రతాపరుద్రుడి పక్షాన యుద్ధరంగానికి వచ్చినప్పటికీ తన బలగాలను దూరంగా మోహరించాడు. యుద్ధరంగంలో 'తన' అనుకున్న వాళ్ల నుంచే జరుగుతున్న వం చన గురించి ఆలస్యంగా తెలుసుకున్న ప్రతాపరుద్రుడు.. స్వయంగా గజారూఢుడై యుద్ధరంగంలోకి దిగాడు. 
                ఈ సమయం కోసమే ఎదురు చూస్తున్న తుగ్లక్ ఆయనవైపునకు పెద్ద ఎత్తున బలగాలను నడిపించాడు. ప్రతాపరుద్రుడి బలగాలను హతమార్చి ఆయన్ను బందీగా పట్టుకున్నాడు. సమీపంలోనే తన బలగంతో మాటువేసి ఉన్న బొబ్బారెడ్డి.. ఆ సమయంలో తన బలపరాక్రమాలు ప్రదర్శించి రాజు మెప్పు పొందాలనుకున్నాడుగానీ అప్పటికే సమయం మించిపోయింది. ఇక, ప్రతాపరుద్రుడి సైన్యంలోనే అత్యంత కీలకస్థానంలో ఉన్న పద్మనాయక (వెలమ) సేనాని గన్నయ.. బందీగా ఢిల్లీ చేరాక ఇస్లాం స్వీకరించి మాలిక్ మఖ్‌బూల్‌గా పేరు మార్చుకొన్నాడు. తన కుయుక్తులతో ఏకంగా ఢిల్లీకి వజీరు కాగలిగాడు. అనంతరకాలంలో.. కాకతీయులు పాలించిన ప్రాంతానికి ఇతణ్ని రాజుగా నియమిస్తే ఈ ప్రాంత పద్మనాయకులు తరిమితరిమికొట్టారు. దీంతో మాలిక్ మఖ్‌బూల్ ఢిల్లీకి పరారయ్యాడు.

విశ్వసనీయతే కాకతీయుల విశిష్టత
అధికారం కోసం పాకులాడలేదు
శాసనాల ప్రకారం వారిది విస్తి వంశం
కులం, మతంపైనా భిన్న వాదనలు
రాయగజకేసరి శిల్పాల్లో రుద్రమదేవి రూపం
80వ ఏట వీర మరణం
                                 - చరిత్రకారుడు పి.వి. పరబ్రహ్మాశాస్త్రి

హైదరాబాద్: ప్రజా క్షేమం, సమాజాభివృద్ధే ధ్యేయం
గా సాగిన కాకతీయుల పరిపాలన ఘనకీర్తి పొందింది. రెండు వందల ఏళ్ల స్వర్ణయుగానికి సాక్ష్యంగా అనేక శాసనాలు, చెరువులు, వ్యవస్థలు ఇప్పటికీ కంటిముందే నిలుస్తున్నాయి. సంగీత, సాహిత్య, శిల్పకళల్లో కాకతీయులు చేసిన కృషి ఆంధ్ర దేశానికే వన్నె తెచ్చింది. కాకతీయుల చరిత్రపై విశేష అధ్యయనం చేసిన చరిత్రకారుడు పి.వి. పరబ్రహ్మశాస్త్రి 'ఆంధ్రజ్యోతి'కి అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. కళ్యాణి చాళుక్యుల నుంచి రాజ్యం పొందిన కాకతీ రాజులపై ఓ అపవాదు ప్రచారంలో ఉంది. 
        చాళుక్యులపై తిరుగుబాటు చేసి అధికారంలోకి వచ్చారని చరిత్రకారులు సమర్థిస్తూ వచ్చారు. కానీ శాసనాల ఆధారంగా చూస్తే కళ్యాణి చాళుక్యులపై కాకతీయులు తిరుగుబాటు చేసినట్లు ఎక్కడా కనబడదు. కళ్యాణి చాళుక్యులు రాజ్యం కోల్పోయిన తర్వాత కర్ణాటకలోని మైసూర్ ప్రాంతంలో తలదాచుకున్నారు. వారు తిరిగి వస్తే వారికి రాజ్యం అప్పజెప్పటానికి కూడా కాకతీయులు చాలాకాలం ఎదురుచూశారు. ఇక కళ్యాణి చాళుక్యులు తిరిగి వచ్చే అవకాశం లేదని తేలిన తర్వాతే 1158లో రుద్రుడు తన సార్వభౌమత్వాన్ని ప్రకటించుకున్నాడు. అధికారం కోసం కాకుండా విశ్వసనీయతతో మెలగడం కాకతీయుల విశిష్టత. 
            నిజానికి కాకతీయులు విస్తి వంశీయులు. వివిధ ప్రాంతాల్లో ఉన్న భూములను సాగులోనికి తీసుకువచ్చి వ్యవసాయం ద్వారా వచ్చిన మొత్తాన్ని కర్ణాటక రాజులకు అందించే వారినే 'విస్తి'లు అనేవారు. అందుకే కాకతీయుల శాసనాలలో తాము విస్తి వంశీయులమని, చతుర్థ వంశీయులమని పేర్కొన్నారు. అందుకే కాకతీయుల తొలి శాసనాలు కన్నడ భాషలో ఉన్నాయి. క్రమంగా వీరు రాష్ట్రకూట రాజుల దగ్గర సేనానులుగా మారారు. ఇక వీరి మతానికి సంబంధించి కూడా అనేక అభిప్రాయాలు ప్రచారంలో ఉన్నాయి. కాని కొన్ని ఆధారాల ప్రకారం వీరిని జైనులుగా కూడా భావిస్తున్నారు. 
             'కాకండి' అనే జైన దేవత పేరు మీద వీరికి కాకతీయులు అనే పేరు వచ్చిందన్న వాదన ఉంది. దీనితో పాటుగా వీరు కర్ణాటకలో 'కాకతీ' అనే గ్రామానికి చెందిన వారనే ప్రతిపాదన కూడా ఉంది. ఇక కాకతీయుల కాలంలో కర్ణాటకలో రెడ్డి కాపులు ఉండేవారు. తొలి కాకతీయులు ఏ కులం వారో చెప్పడానికి ఇప్పటివరకు చరిత్రకారులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఇక రుద్రమదేవి తప్పితే కాకతీయరాజులెవరూ తమ విగ్రహాలను చెక్కించుకోలేదు. శాసనాల ఆధారంగానే రుద్రమ దేవి రూపాన్ని అధ్యయనకారులు తెలుసుకోగలిగారు. రుద్రమదేవికి రాయగజకేసరి అనే బిరుదు ఉంది. 

               ఏనుగుల్లాంటి శత్రువులను జయించిన సింహాల వంటి రాజు అని దాని అర్థం. వరంగల్ కోటలోని స్వయంభూ ఆలయంలో 'రాయగజకేసరి' పేరిట కొన్ని శిల్పాలు ఉన్నాయి. ఈ శిల్పాలలో ఒక ఏనుగు, దానిపై ఒక సింహం, దానిపై ఒక యువతి కూర్చుని ఉంటుంది. యాదవ రాజును జయించిన తర్వాత రుద్రమదేవి ఈ శిల్పాలను చెక్కించింది. ఈ శిల్పంపై ఉన్నది రుద్రమదేవే! అయితే ఈ విషయాన్ని ఇప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు. కేంద్ర పురావస్తుశాఖ వద్ద ఈ తరహా శిల్పాలు నాలుగైదు ఉన్నాయి. వాటిపై పరిశోధన చేస్తే రుద్రమదేవి రూపాన్ని అంచనా వేసే అవకాశాలున్నాయి. త్రిపురాంతకం వద్ద అంబదేవుడితో జరిగిన యుద్ధంలో రుద్రమదేవి మరణించింది. 
               ఆ సమయానికి ఆమెకు దాదాపు 80 ఏళ్లు. ఆమెను యుద్ధానికి మల్లికార్జునుడు అనే సేనాని తీసుకువెళ్లాడు. అంబదేవుడి దాడిలో సేనాని కూడా చనిపోయాడు. ఇది 1289లో జరిగింది. ఈ ఘటన జరిగిన తర్వాత 11వ రోజున మల్లికార్జునుడి కుమారుడు చెందుబట్ల శాసనం వేయించాడు. రుద్రమదేవి ఎప్పుడు చనిపోయిందో ఆ శాసనంలో స్పష్టంగా ఉంది. ఇక ప్రతాపరుద్రుడిది ఆత్మహత్య అనటానికి కూడా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. మహ్మదీయ సేనల చేతిలో బందీకావటం ఇష్టం లేక ప్రతాపరుద్రుడు ఆత్మహత్య చేసుకున్నాడని అనితల్లిరెడ్డి వేయించిన శాసనం చెబుతోంది. ఈ శాసనంలో 'స్వేచ్ఛఐవ' అని ఉంటుంది. అంటే ఆత్మహుతి చేసుకున్నాడని అర్థం. ఇంతటి ఘన చరిత్ర కలిగిన కాకతీయ రాజులకు ఆం«ద్రుల చరిత్రలో దక్కాల్సినంత స్థానం దక్కలేదన్న వాదన చరిత్రకారుల్లో వినిపిస్తోంది.                                                                                                                                                                      - ఆంధ్రజ్యోతి